పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము.

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 86)
క.

విత్రస్తాఘపవిత్రచ, రిత్ర జితత్రిదశవర ధరిత్రీసుతస
స్మిత్రాంబుజమిత్రగుణా, మత్ర యనుప్రాస మిదియె మల్లియరేచా!

99


వ.

అని యున్నది గనుక కొందఱు ఇదే ఛేకానుప్రాసమనిన్ని లాటానుప్రాసమనిన్ని
గొంద ఱనుప్రాస మనిన్ని వాడుకొందురు గనుక జాడ తెలుసుకొనేది.

100

శకారప్రాసలక్షణము

అథర్వణచ్ఛందంబున
క.

తొలుత శకారమ్ములు తిగ, గలిగి సకార మొకటైన గాక సకార
మ్ములు తిగ శకార మొక్కటి, గలిగిన శప్రాస మండ్రు కంజదళాక్షా!

101


తా.

శకారములు మూఁడు ఒకసకారమయినా సకారములు మూఁడు ఒకశవర్ణమయినా ప్ర్రాసము లుంచి పద్యములు చెప్పవచ్చు ననుట.

లక్ష్యము
క.

వసునగసమధీరుం డై, పొసఁగిన యానందరంగభూపతి సభ నిం
పెసఁగిన తారలనడుమన్, శశి భాసిలురీతి వెలయు జనులు నుతింపన్.

102
మఱిన్ని, నన్నయభట్టు ఇంద్రవిజయమున
క.

ఆసరసిజాక్షి కౌనుకు, గా సరి యొక్కింతపోలుకతమునఁ గద యా
కాశ మనంతాహ్వయమునఁ, గేసరి హరినామమునఁ దగెన్ విను మింద్రా!

103
అప్పన్న ఆంధ్రపదప్రయోగమున
క.

పసలేని పనికిఁ బోయిన, రసభంగము గాక మేలు రానేర్చునె యెం
తసహాయశూరుఁ డైనను, దశ దప్పిన నేమి సేయు దశరథరామా!

104
పరమభాగవతచరిత్రమున
క.

ఆశీర్వదించి శుకుఁ డుచి, తాసీనుం డగుచు రాజు నంద నునిచి యా
వేశకృపామతి శాప, క్లేశవిషాదాత్ముఁ డగుటఁ గృతనిశ్చయుఁ డై.

105
భాస్కరరామాయణము, యుద్ధకాండమున
ఉ.

వ్ర్రేసియుఁ జీరియున్ బొడిచి వ్రేచియుఁ గ్రుచ్చియుఁ జించి త్రుంచి చి
ట్టేసియుఁ గూల్చియున్ బగుల నెమ్ములు రాల్చియుఁ గ్రుచ్చి నుగ్గుగాఁ
జేసియుఁ గంఠముల్ దునిమి చిందఱవందఱగుఁ గాఁగ మోదినన్
గీశులు భీతిఁ జెంది దమకించుదు రాఘవుమర్వు చొచ్చినన్.

106