పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దాసాదిగీర్వాణకవులు నన్నయభట్టప్రముఖాంధ్రకవులు గావించిన మహాకావ్యం
బులందు లక్ష్యంబులు వివరించి సకలకవిసమ్మతంబుగా నానందరంగచ్ఛందం బను
లక్షణగ్రంథంబు విస్తరించెద.

22


తే.

ననలతోఁ గూడి వాసించు నారరీతి, శంఖమునఁ గూడి తీర్థ మౌ జలముభాతిఁ
బూర్వసుకవీంద్రసాహిత్యములను గలసి, నేను రచియించు సాహితి నెగడకున్నె?

23


వ.

అని యింతిం తనరానిసంతసంబున నజారతరాయవిజయానందరంగరాయచక్రవర్తి
పేర నంకితంబుగ ఛందంబుఁ బొందింప నుద్యుక్తుండ నగుటంజేసి తత్కృతిపతి
వంశావతారం బభివర్ణించెద.

24


సీ.

ఏదేవదేవునిపాదపరాగంబు శిరసావహించు నిర్జరసమూహ
మేమహామహుదివ్యనామకీర్తనములు భజన గావింతురు పరమమౌను
లేస్వామిశుభమూర్తి నీక్షింప మదిఁ గోరి కమలజప్రముఖులు నెమకుచుందు
రేదయానిధియసాంగేక్షణం బాశించి వ్యాసాదిసద్భక్తు లాశ్రయింతు


గీ.

రట్టిపురుషోత్తమునిఁ బరమాత్ముఁ డైన, కృష్ణదేవుని సుతునిఁగాఁ బ్రేమఁ బడసి
బలిమిఁగలిమిని మించి వ్రేపల్లెనుండు, నందుఁ డొకనాఁడు సంతతానందుఁ డగుచు.

25


సీ.

శ్రీకృష్ణమూర్తి నీక్షించి మించినభక్తిఁ "బరమాత్మ జగదీశ భక్తవరద
నీ విట్లు వసుదేవదేవకీదేవులకడుపునఁ బుట్టి నా కొడుకు వనఁగ
నమరి సమస్తలోకములను సత్కీర్తి యొనరఁజేసితివి యింకొక్కమనవి
యున్నది నీవు సమున్నతప్రేమ మద్వంశంబున జనింపవలయు” ననుచు


తే.

నెలమిఁ బ్రార్థింప నట్టులే కలియుగమున, నవతరించెద నని చాల నాదరించి
పలుక నానందుఁ డుల్లంబు పల్లవిల్ల, నల్ల వ్రేపల్లె శ్రీ లుల్లసిల్ల వెలసె.

26


క.

ఆతనిమనుమలు భువన, ఖ్యాతభుజాబలవినిర్జితారాతిధరి
త్రీతలనాథులు కొందఱు, నూతనరాజ్యపరిపాలనోత్సుకు లగుచున్.

27


తే.

ప్రబలి తమకు విభాగసంప్రాప్త మగుచు, నెగడు మంజీరవాణీమణీతటాక
మంచితనిజోత్తమాంగంబు లను పురత్ర, యమును నేలుచు నుండిరి హర్షమునను.

28


క.

అం దగ్రవంశజుఁడు గో, విందనృపతి యయనపురము వెస నేలుచు శ్రీ
లంది యంశంబొంది విజయ, నందనుఁ డనుపేర వెలయునందనుఁ బడసెన్.

29


ఇట్లు పడసిన యాకుమారశ్రీముఖుఁడు దినదినప్రవర్ధమానుండై, చతుష్షష్టివిద్యా
విశారదుఁడై సకలశుభలక్షణలక్షితుండయి తేజరిల్లుచు నొక్కనాఁడు మృగయా
వినోదంబుగా వనాంతరంబునకుం జని యచ్చట విహరించుసమయంబున.

30