పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఘనుఁడు విద్యారణ్యుఁ డనుపుణ్యపురుషుఁడు, బహుళతరైశ్వర్యపదవిఁ గోరి
పరదేవతోపాస్తి బహుకాల మొనరింప, నయ్యంబ ప్రత్యక్షమగుచు నీదు
కోర్కె లీడేర్తు నింకొకజన్మమున కంచుఁ, బలికిన వ్యాకులపాటుఁ జెంది
సన్న్యసించినను దత్క్షణమున నాదేవి, సాన్నిధ్యమై మహైశ్వర్యసమితి


తే.

బలిమి నొసఁగినఁ జింతించి తెలివిఁ గాంచి, విజయనగరాఖ్యపురము గావించి మించి
దీనిఁ బాలించుటకు యోగ్యుఁడైన నమ్మేటి, యెవ్వఁడో యనియాత్మలో నెంచుచుండ.

31


తే.

అమ్మహారణ్యసీమ వేఁటాడు విజయ, నందనునిఁ జూచి యతని నానగరమునకు
శ్రీకరంబుగఁ బట్టాభిషిక్తుఁ జేసి, విజయనందనరాయ లన్ పే రొసంగె.

32


చ.

అతఁడు సమస్తభూమివలయం బనవద్యవిశేషనీతిప
ద్ధతిఁ దగ నేలుచుం గుటిలదర్పవిరోధివరూధినీహిమ
ప్రతతి సహస్రభానుఁ డనఁ బ్రస్తుతికెక్కి మనోజ్ఞభాషియై
శ్రితజనపోషియై ప్రజజఁ జేకొని ప్రోచెను వన్నెవాసిగన్.

33


సీ.

ఆమహామహునకు రామచంద్రాఖ్యరాయలు పుట్టె నతనికి నెంచ (యంబ) దేవ
రాయ లావిభునకు రాజశేఖరరాయ లానరేంద్రునకు గోళనరసింహ
రాయ లతనికి శ్రీరామచంద్రేశుఁ డాఘనునకు లాంగూలగజపతీంద్రుఁ
డతనికి గరుడమహాదేవరాయ లాధీరున కచ్యుతదేవరాయ


తే.

లాయనకు వీరనరసింహరాయనృపతి, చంద్రు లుదయించి రందఱు ఛత్రపతులు
చక్రవర్తులు నై ధరాచక్ర మేలి, మేలుఁగాంచిరి ప్రజలు మేల్మే లనంగ

34


సీ.

ఆవీరనరసింహభూవరుపట్టంపురాణి లక్ష్మమయందు రామదేవ
రాయలు తిరుమలరాయలు శ్రీరంగరాయ వేంకటపతిరాయఘనులు
హేమంతరాయ లీయేవురు పుట్టిరి యడపకత్తైనదీపాలియందుఁ
గృష్ణరాయలు పుట్టి కీర్తిగా నప్పాజి యనుమంత్రిఁ గూడి


తే.

యశము రెట్టింప బంధువు లనుమతింపఁ, దొలుతఁ చెప్పిన యేవురుదొరలు కొంత
సీమ కధిపతు లై రందు రామదేవ, నృపతిమణి చంద్రగిరిదుర్గ మేలుచుండె.

35


క.

ఆరామదేవరాయధ, రారమణునకున్ దివాకరసముద్యుతి మై
మీఱి కళాధరుఁ డనెడుకు, మారుఁడు జనియించె వంశమండనుఁ డగుచున్.

36


చ.

లలితగుణాభిరాముఁ డకలంకయశోవిభవుండు సింహస
ద్బలుఁడు కళాధరుండు తమతాతలనాఁటిమిరాశి యై సము
జ్జ్వలబలరాశియో యనఁగఁ బట్టణరాజ్యముఁ జేరి యచ్చటం
జెలువుగ రాజ్యపాలనము సేయుచునుండె ననేకవర్షముల్.

37