పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ధరణి ప్రాంసుమహారాజదత్తమత్త, కరటిఘటఘోటకభటాదిఘనవిభూతి
ప్రబల శ్రీమద్వజారతరాయవిజయ, లాంఛనానందరంగధరావరుండు.

13


సీ.

అమితవిక్రము లైనహదురావు లొకచోట నొకచోట మత్తరాహుత్తవితతి
సరిలేక మితిమీఱుసరదారు లొకచోట నొకచోట రాయబారికసమాజ
మమరఁ గుంపినివర్తకావళి యొకచోట నొకచోటఁ దక్కునుద్యోగిజనము
ఘనధరామండలాఖండలు లొకచోట నొకచోట రాయనియోగిచయము


తే.

లొకట శాబ్దికతార్కికసుకవిరాజ, వందిమాగధగాయకవైణికభట
నటవిటులు గొల్వఁగా సమున్నతవిభూతి, రమణఁ గొల్వుండె నానందరంగవిభుఁడు.

14


వ.

వెండియు సముద్దండభుజదండమండలాగ్రఖండితారిభూమండలాఖండలశుండా
లకాండవరూధినీమండలుండును, మండలీకృతకోదండముక్తచండకాండదండి
తాభియాతిసమూహఢిల్లీశ్వరప్రముఖరాజన్యమూర్ధన్యమస్తకనిస్తులకోటీరకోటీ
రచితశోణమణిశ్రేణీవిరాజితపదరాజితప్రాంసుమహారాజేంద్రహృదయాను
గతచరత్కుంపినీప్రభువర్యసర్వకార్యనిర్వహణచణమనిషావిశేషుండును,
శేషశయనచరణారవిందమకరందతుందిలేందిందిరాయమాణమానసకథాభి
(కిడాంబి)శ్రీనివాసాచార్యవర్యపదభక్తివైభవుండును, భవనాంతరప్రవర్ధమాన
సామ్రాజ్యలక్ష్మీవిలాసభాసురుండును, సురధేనుమందాకినీమందారకుంచార
విందారిబృందారకాహారహారడిండీరతుషారక్షీరపారావారవారణాహితసితఘ
నాఘనఘనసారనారదపారదశారదాశరధరదరపురస్రహరగిరికులిశమరాళహరి
దంతకరిదంతనితాంతకాంతియశస్సమాక్రాంతభూనభోంతరుండును, తరతమ
ప్రజ్ఞావిచక్షణుండును, క్షణక్షణప్రవర్ధితోత్సాహబాహుళ్యుండును నగుచు నిగ
నిగమను మగఱాలనిగరాలజిగి చాలఁజాలుకొను జాళువారుటంపుబోదియలప్రోది
యలమించుపగడాలజగడాలకంబంబులు డంబుమీఱి విడంబించు నీరాజచందువుల
నందంబై చెలువొంది నిండుసరిగెబహతిపనిహర్వుజాలరులన్ జాలుకొని క్రొత్త
ముత్తియపుగుంపుల నింపఁజాలు తివాసులరతనంపుజతనంబుల మించు జలతారు
బారిమెఱుఁగుదిండ్లు బటువుబిల్లలు నుల్లసిల్లుకొల్వుకూటంబున సుఖాసీనుండై
సకలరాజాధిరాజపరివృతుం డగుపట్టాభిరామమూర్తితెఱంగున నిఖిలయాదవసమ
న్వితుండైన కృష్ణదేవునిఠీవిని సమస్తబృందారకసంసేవితుండైన దేవేంద్రునిచందం
బున నపారతారకాగణమధ్యభాసమానుం డగుపూర్ణచంద్రునియోజం దేజరిల్లుచు
నొకయెడ జాతామిత్రు లగుమిత్రులును, నొకచెంతఁ బురోహితు లగుపురోహితు
లును, నొకచాయ గాయకులగు గాయకులును నొకదండఁ బండితు లగుపండితులును,
నొకయోర నర్థులగు నర్థులును వెలయ నొకక్రేవ నిజకీర్తిప్రతాపదీపితగద్యపద్యా