పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సితచంద్రుఁ డిచ్చు గుశల మ, సితసోముఁడు తునుము రణము చేయును రక్త
ద్యుతినిధుఁడు పీతశశి ధీ, రత హర్ష మొసంగుఁ జాల రంగనృపాలా!

215


క.

నలినారి యేగ్రహముతో, నలిపడెఁ దద్వర్ణమై శుభాశుభఫలముల్
గలిగించు భగణ మట్లనె, చెలఁగున్ బతి చంద్రుఁ డగుట శ్రీరంగనృపా!

216


తా.

చంద్రశుక్రులు తెలుపు, సూర్యాంగారకు లెరుపు, బుధబృహస్పతులు పసుపు, శనిరాహులు నలుపు, చంద్రుఁ డేగ్రహముతోఁ గూడిన నావర్ణమై యాఫలమునే యిచ్చును. తాను ప్రత్యేకముగ నుండినఁ దనఫలము నిచ్చును. శుక్రబుధబృహస్పతులతోఁ జంద్రుఁడు కూడిననాఁడు ప్రబంధ మారంభించిన శుభకరము. సూర్యాంగారకశనిరాహువులతోఁ జంద్రుఁడు కూడియున్న నక్షత్రమునఁ గృతి యారంభించిన నశుభకరము. అట్లే భగణమును జంద్రాధిదైవత్య మైనగణము గనుక స్వకీయమైనఫలము నీఁజాలదు. ఏగణమునుఁ గూడియుండిన నారీతిగ శుభాశుభఫలముల నిచ్చును.

ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమందు
“శ్లో.

రక్తే చంద్రే భజే ద్యుద్ధం కృష్ణ మృత్యు ర్నసంశయః
తజ్జయంతు విజానీయా త్పీతే శుభకరం భవేత్.”

217
కవిసర్పగారుడంబున
గీ.

చంద్రుఁ డేగ్రహంబు సరస నిల్చిన దాని, వర్ణమై శుభాశుభంబు లిచ్చు
భగణ మేగణంబుఁ దగిలినఁ దత్ఫలం, బిచ్చుఁ దనకుఁ జంద్రుఁ డీశుఁ డగుట.

218
మఱియును
గీ.

శశియు శుక్రుండు తెల్లనిచాయవారు, సవితృఁడును మంగళుఁడుఁ గెంపుచాయవారు
సౌమ్యుఁడును జీవుఁడును బైఁడిచాయవారు, శనియు రాహువు నల్లనిచాయవారు.

219


గీ.

ధవళచంద్రు వలనఁ దనరారుఁ గుశలంబు, సమరమగును శోణచంద్రువలన
నీలచంద్రువలన నిధనంబు సిద్ధించుఁ, బీతచంద్రుఁడైనఁ బ్రీతిఁజేయు.

220


వ.

అనియున్నది గనుక నిది తెలిసి పద్యాదిగణంబులకు వర్ణంబులకు గ్రహమైత్రి
కలుగఁ జెప్పవలెను.

221
కాళిదాసు, రఘువంశమున

“వాగర్ధా వివసంపృక్తౌ"

222


వ.

అన్నాఁడు గాన నందు మొదటిమగణసగణములకు బుధశనులు గ్రహములు గనుక
ను, వకారగకారములకుఁ జంద్రాంగారకులు గ్రహములు గనుకను సమమైత్రి.

223