పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కుజునకుఁ జంద్రార్కగురులు హితులు శుక్రార్కజు ల్తుల్యు లరాతి బుధుఁడు
బుధునకు సూర్యకావ్యులు హితు ల్శనికుజగురులును సములు చందురుఁడు వైరి
గురునకు రవిహిమకరకుజుల్ హితులు శత్రులు కవిబుధులు మందుండు సముఁడు
కవికి మిత్రులు బుధార్కజులు తుల్యులు కుజగురువులు చంద్రభాస్కరులు రిపులు


తే.

మందునకు బుధశుక్రులు మైత్రివారు, సముఁడు ధిషణుఁడు కుజసూర్యచంద్రు లరులు
గాఁగ సమమైత్రి వైరముల్ గ్రహముల కగు, రసికమణి విజయానందరంగశౌరి.

210


తా.

సూర్యునకుఁ జంద్రాంగారకులు మిత్రులు, శుక్రశనైశ్చరులు శత్రులు, బుధుఁడు సముఁడు; చంద్రునకు సూర్యబుధులు మిత్రులు, శుక్రశనిబృహస్పతికుజులు సములు, శత్రువులు లేరు; అంగారకునకుఁ జంద్రసూర్యబృహస్పతులు మిత్రులు, శనిశుక్రులు సములు, బుధుఁడు శత్రువు; బుధునకు సూర్యశుక్రులు మిత్రులు, శన్యంగారకబృహస్పతులు సములు, చంద్రుఁడు శత్రువు; బృహస్పతికి సూర్యచంద్రాంగారకులు మిత్రులు, శని సముఁడు, బుధశుక్రులు శత్రువులు; శుక్రునికి శనిబుధులు మిత్రులు, అంగారకబృహస్పతులు సములు, సూర్యచంద్రులు శత్రువులు; శనికి బుధశుక్రులు మిత్రులు, బృహస్పతి సముఁడు, సూర్యచంద్రాంగారకులు శత్రువులు గనుకఁ దెలియునది.

ఇందుకు లక్ష్యము, సులక్షణసారంబున
సీ.

ఇనశశుల్ రవికుజు లినగురు ల్గురుభూజులు శనార్కజుల్ శుక్రశశితనూజు
లన్యోన్యమైత్రివా రమరంగ బుధరవుల్ గురుసుధాధాములు కుజశశులును
మందసౌమ్యులు సమమైత్రివారలు గురుశనులును గవికుజుల్ సమమువారు
మార్తాండశుక్రులు మందప్రభాకరు లన్యోన్యశాత్రవు లైనవారు


తే.

రాజసౌమ్యులు శత్రుమిత్రములవారు, గురుకవులు కుజసౌమ్యులు గురుబుధులును
శనికుజులు భార్గవేందులు సౌరిశశులు, వరుస సమశాత్రవంబుల వారు రామ.

211
మఱియును, కవిసర్పగారుడమున
గీ.

మైత్రి యత్యుత్తమము సమమైత్రి గలయ, మధ్యమం బగు సమ మధమంబుఁ దలఁప
శాత్రవము మారణము శత్రుమిత్రయుతము, జగడము విరోధ మగు సమశాత్రవమున.

212


వ.

అని యున్నది గనుక నిది తెలిసి సాహిత్యము ఘటియించునది.

213

గ్రహవర్ణనిర్ణయములు

క.

కవిచంద్రులు తెల్లనివా, రవనిజభాస్కరులు నెరుపు నాంగిరసబుధుల్
భువిఁ బసుపు రాహుమంద, చ్ఛవి నల్లన యండ్రు రంగజగతీనాథా!

214