పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

మీనము, ధనుస్సు, కన్య, కటకము యీనాల్గురాసులు కలవారిపేర సత్త్వవేళఁ బ్రబంధ మారంభింపరాదు. మేషము, తుల, వృశ్చికము, వృషభము, యీనాలుగురాసులు కలవారిపేర రాజసవేళయం దారంభింపరాదు. మకరము, సింహము, కుంభము, మిథునము యీనాల్గురాసులు గలవారిపేరఁ దామసవేళఁ బ్రబంధ మారంభింపరాదు.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
సీ.

అంగనాచాపమత్స్యకుళీరరాసుల వెలయువారికి సత్త్వవేళలందు
వృషభతౌలీమేషవృశ్చికరాసుల వెలయువారికి రజోవేళలందు
మకరపంచాస్యయుగ్మకకుంభరాసుల వెలయువారికిఁ దమోవేళలందుఁ
గూర్చుండి కబ్బంబుఁ గూర్చియిచ్చిన భర్త మట్ట మేఁడాదికి మట్టుపడును


తే.

గవియు నన్నిదినాలకే కర్తతోడ, గంటగొట్టినచందాన గంతు వేయు
శిథిలమై కావ్యసరణి విచ్ఛిత్తిఁ జెందుఁ, గర్తృకారసంస్కారసంగతులఁ గూడి.

206


వ.

అని యున్నది కానఁ దెలిసి రచియించునది.

207
నక్షత్రములకు రాసు లేర్పఱచు క్రమము

అశ్వినీ భరణీ కృత్తికా పాదః మేషమ్ ఇత్యాదులు.

207

రాశ్యధిపతులు

గీ.

రవి హరికి రాజు కర్కికి నవనిజుఁ డజ, వృశ్చికములకు బుధుడు స్త్రీమిథునములకు
గురుఁడు ఝషధనువులకు శుక్రుండు వృషభ, తులల కార్కి మకరకుంభములకుఁ బతులు.

208


తా.

సూర్యుఁడు సింహమునకుఁ, జంద్రుఁడు కర్కాటకమునకు, నంగారకుఁడు మేషవృశ్చికములకు, బుధుఁడు కన్యామిథునములకు, బృహస్పతి ధనుర్మీనములకు, శుక్రుడు వృషభతులలకు, శని మకరకుంభములకు నధిపతు లని తెలియునది.

ఇందుకు లక్ష్యము కవిసర్పగారుడమున
చ.

దినపతికర్త కేసరి, కధీశుఁడు కర్కికిఁ జంద్రుఁ, డుర్వినం
దనుఁ డజవృశ్చికంబులకు నాథుఁడు, సౌమ్యుఁడు రాజు యుగ్మకాం
గనలకుఁ, జాపమత్స్యములకర్త బృహస్పతి, భార్గవుండు భ
ర్త నలిఁ దులావృషంబులకు, గ్రాహఘట ప్రభుఁ డర్కజుం డగున్.

209

గ్రహమైత్రి

సీ.

తరణికి శశికుజగురులు మిత్రులు శుక్రశనులు విద్వేషులు సముఁడు బుధుఁడు
చంద్రునకును సూర్యసౌమ్యులు మిత్రులు శనిశుక్రగురురుజల్ సమమువారు