పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లక్షణకవి యగువాఁడు స్వరనిర్ణయ మెఱింగి యేదిక్కున స్వరమున్నదో యాదిక్కున కెదురుగాఁ గూర్చుండి కవిత్వము రచియించినఁ గృతిపతి కాయురారోగ్యభాగ్యములు గలుగును.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
క.

అసదృశకాదిక్షాంతా, ర్ణసమూహంబునకుఁ దగు స్వరంబులు వరుసన్
పొసఁగంగను నేడింటికి, వెస బాలకుమారరాజ్యవృద్ధామృతముల్.

174
మఱియును
చ.

ప్రమదవిధిజ్ఞు లైనకవిరాజులు బాలకుమారరాజ్యవృ
ద్దమృతము లింద్రుదిక్కునఁ గృతాంతుఁడు కాపుర మున్నచోటఁ బ
శ్చిమమున నుత్తరంబునను శ్రీగళు దిక్కున నుండుఁ గానఁ బ
ద్యము నిడ దత్ఫలం బెఱిఁగి యాముఖమై రచియింపఁగాఁదగున్.

175


శా.

బాలాదిస్వరపంచకంబునకు నాభానూదయం బాదిగా
గాలంబు ల్విభజించి యాఱుగడియల్ గాఁ జేసి యొండొంటికిన్
వాలాయంబుగఁ బంచివేసి మన కావ్యంబుల్ కవిశ్రేష్ఠు లా
వేళన్ దత్ఫలనిర్ణయంబుకొలఁదుల్ వీక్షించి చెప్పందగున్.

176


క.

బాలస్వర మతిలాభము, పోలింపఁ గుమారరాజ్యములు ధనరాజ్య
శ్రీ లురుజాడ్యము వృద్ధం, బాలంబునఁ గడపునవలి దాఁగృతికర్తన్.

177


వ.

అని యున్నది గనుక లెస్సగాఁ దెలిసి కవిత్వముం జెప్పునది.

178

రసమైత్రి

క.

వరకరుణహాస్యము లు, ర్వరవీరభయానకములు రౌద్రాద్భుతముల్
మఱి బీభత్సము శృంగా, రరసముఁ గదియింపఁ దగదు రంగనృపాలా.

179


తా.

కరుణారసమునకు హాస్యరసమునకు వీరరసమునకు భయానకరసమునకు, రౌద్రరసమునకు, అద్భుతరసమునకు, భీభత్సరసమునకు, శృంగారరసమునకు నవ్యోన్యవైరము గనుక రసమైత్రిఁ దెలిసి గణములలోఁ బ్రయోగించఁదగినది.

ఇందులకు, సులక్షణసారంబున
గీ.

మున్ను శృంగారభీభత్సములకు నొంట, దరులు తమలోన వీరభయానకములు
సమవిరోధంబు రౌద్రాద్భుతముల కపుడు, హాస్యకరుణములకుఁ బగ యనుదినంబు.

180

జీవనిర్జీవవ్యాధితనక్షత్రములు

వాసిష్ఠసంహితయందు

“నిర్జీవం సప్తఋక్షాణి సజీవం ద్వాదశ స్మృతమ్,
వ్యాధితం నవఋక్షాణి సూర్యఋక్షం సమారభేత్.”

181