పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శాస్త్రకారకుఁడు

"శ్రియ మిచ్ఛే ద్ధుతాశనాత్" అనియుఁ జెప్పుటచేత నాయగ్నియు లక్ష్మీప్ర
దుఁడుగను, శ్రీకారము లక్ష్మీప్రదమని యెఱుఁగునది.

144

లక్ష్యము

సులక్షణసారంబున
క.

శ్రీకారము ప్రథమంబునఁ, బ్రాకటముగ నున్నఁ జాలు బహుదోషంబుల్
పోకార్చి శుభము లొసలును, బ్రాకటముగ నినుము సోఁకుపరుసముమాడ్కిన్.

145
మఱియు, విశ్వేశ్వరచ్ఛందంబున
గీ.

దిక్ప్రసిద్ధంబుగా మును దీర్ఘమయ్యు, ననఘతరసంయుతాక్షర మగుటఁ జేసి
ధరను శ్రీకార మతిశుభదాయి యగుచుఁ, గాంచె నాద్యుక్తలిఖితవిఖ్యాతి రామ!

146

సురనరతిర్యగ్రౌరవలక్షణము

గీ.

పంచవర్గాంతదుర్వర్ణపంక్తి దక్క, కొదువ సురగతు లగు నవి గురువు లైన
నృగతులగు నధోగతి యగురేఫ తక్కు, నఙఞణమలు తిర్యక్కు లానందరంగ.

147


తా.

కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు యీ 5 వర్గువులయందలి కడపటియక్షరము లగు ఙఞణనమలుగాక తక్కినయిరువదియక్షరములు సురగతులు. ఆయక్షరములు గురువులైన నరగతులు. రేఫమాత్ర మధోగతి. ఆరేఫతక్కఁ దక్కినయకారాద్యక్షరములు ఙఞణనమలు ఇవి తిర్యగ్గతు లనఁబడును. పద్యాదిని సురగతులు నరగతులు నైన యక్షరములఁ బ్రయోగింపవచ్చును. తిర్యగ్గతులు కూడవు. అధోగతియగు రేఫ పనికిరాదు.

ఇందుకు లక్ష్యము, శ్రీధరచ్ఛందంబున
క.

సురవరతిర్యగ్రౌరవ, వరగతు లగుభూసురాదివర్గాక్షరముల్
గురులఘువులు నరసురగతు, లరిరాయనిఫాలసోమ యవనీపాలా.

148
కవిసర్పగారుడమున
సీ.

నణమఙఞావిహీనం బగువర్గపం, చకములఁ గల్గునక్షరము లెల్ల
నెరయంగఁ గుఱుచలై నిర్జరగతులగు, నిడుదలై యుండిన నృగతు లగును
న ఋ ౠ ఌ ౡ ఙఞణమలు రేఫవిహీన, యాద్యష్టకమును దిర్యక్క్రమంబు
అగుగాని రేఫ యధోగతి యగు నిందుఁ, బ్రత్యేకదళము లేర్పడఁగ వరుస


తే.

సురనృగత్యక్షరంబులు శుభము లొసఁగు, మధ్యఫలద తిర్యగ్గతమాతృకాళి
నిరయ గతవర్ణ మొక్కటి నెరయఁ గాను, ప్రౌఢకవులు రచించుకబ్బముల మొదల.

149