పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యున్నది గనుకఁ బద్యాదిని శ్రీకారము చెప్పకున్నట్టైన శుభాక్షరముగా విమ
ర్శించి యాదిని ముఖాక్షరముగా నిలుపఁదగినది.

136

అమృతాక్షరవిషాక్షరనిర్ణయము

కవికంఠపాశే

“అకచటతపయశవర్గా దమృతం ప్రోక్తం విపాణి దీర్ఘాణి”

137
గోకర్ణచ్ఛందంబున
క.

అమృతాక్షరములు హ్రస్వము, లమరఁగ దీర్ఘములు విషము లనఁబడు దీనిన్
గ్రమమున నకచటతపయశ, సముదయమునఁ దెలిసి నిలుపఁజనుఁ బద్యాదిన్.

138


తా.

దీర్ఘములు లేనియక్షరము లమృతాక్షరములు గనుక నవి పద్యాది నుంచఁదగినవి. దీర్ఘాక్షరములు విషాక్షరములు గనుక నవి పద్యాది నుంచరా దనుట. అయినను నాయక్షరము సంయుక్తాక్షర మైనచోఁ దనగుణమును విడిచి వేఱుగుణమును బొందును.

ఇందుకు లక్ష్యము, మాతృకానిధానే

"నిశారజః క్షారయోగా త్తక్షణా ద్రక్తతాయథా”

139
భీమన
క.

వినఁబడు దీర్ఘము విషమును, ననియెడివర్ణమ్ము సంయుతాక్షర మైనన్
మునుపటిగుణములు విడివడి, తనరన్ వేఱొక్కగుణముఁ దాల్చును బేర్మిన్.

140


వ.

పచ్చనిపసుపు తెల్లనిసున్నము గూడిన వానివర్ణములు విడిచి రక్తవర్ణ మైనట్టు లనుట.
శ్రీకారము దీర్ఘాక్షరమును సంయుక్తాక్షరము నయియుండి యెట్టు లత్యుత్తమ
మయ్యె ననఁ దద్విధంబు వివరించెద.

141


చ.

శరలకుఁ జంద్రుఁ డీకి రవి చాలగ్రహంబు లటంచు వార లి
ద్దఱు హితు లంచు నీశలకు దేవత లక్ష్మి యటంచు రాకు శ్రీ
కరుఁ డగువహ్ని యంచు మును గావ్యులు శ్రీ శుభవర్ణనిర్ణయం
బరసి ఘటించి రౌ కృతులనాది నభీష్టము లుల్లసిల్లఁగన్.

142


తా.

శవర్ణమును ఈకారమును రేఫయును గూడిన శ్రీకారమయ్యెను. అందు శవర్ణరేఫలకుఁ జంద్రుఁడు గ్రహము. ఈకారమునకు సూర్యుఁడు గ్రహము. గనుక వారి కిద్దఱికి నన్యోన్యమైత్రి. ఈకారశవర్ణముల కధిదేవత లక్ష్మీదేవి. రేఫ కధిపతి యగ్ని.

చమత్కారచంద్రికయందు

“లక్ష్మీప్రదో హుతాశనః” అనియు.

143