పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అధర్వణచ్ఛందమున:—
గీ.

ఇందుమాళివలన నంది గాంచిన ఛంద, వెలమిఁ జదివి రొకరివలన నొకరు
లలి సనత్కుమార కలశజ జీవ వృ, త్రారి శేష పింగళాఖ్యు లోలి.

23

గురులఘుసంజ్ఞలు

క.

సున్నలు గలవర్ణములు స, మున్నతదీర్ఘాక్షరములు నూఁదినలిపులున్
జెన్నుగ గురువులు దక్కిన, వన్నియుఁ బరికింప లఘువు లగు రంగనృపా!

24


వ.

సున్నలు గలయక్షరములు, దీర్ఘములగునక్షరములు, సంయుక్తాక్షరములకు ముం
దున్న యక్షరములు ఇవియన్నియు గురువులు, తక్కినవి లఘువులు.

25


గీ.

చంద్రవంకవిధము వ్రాయుసంజ్ఞ గురువు, మరునిబాణమువలె వ్రాయుగురుతు లఘువు
నట్టి గురులఘుత్రయముచే నగుగణములు, రసికమందార యానందరంగధీర!

26


వ.

గురువు U, లఘువు I, ఇట్లు తెలియునది.

27


క.

మొదలక్షరంబు వడి యగుఁ, బదపడి రెండవది వెలయుఁ బ్రాసం బగుచున్
బదపద్యవృత్తజాతుల, నిదియే యానందరంగ! నృపసారంగా!

28


క.

చరణాదిని లఘువుండిన, గురువుండిన నట్ల నాలుగుచరణములకున్
సరిపడ రచియింపవలెన్, వరవిజయానందరంగ వసుధాధిపతీ!

29

గణములు

వృత్తరత్నాకరమున:—

“ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్,
భజసా గౌరవం యాంతి మనౌతు గురులాఘవే.”


గీ.

మొదల నడుమను దుద గురు లొదవెనేని
భజస లగు నట్ల లఘువులు పరగెనేని
యరత లగు నాది మూఁడేసిగురువు లున్నఁ
దగ లఘువు లున్న మగణంబు నగణ మగును.

30


క.

రంగేంద్రా యన మగణము, రంగన యన భగణమయ్యె రంగేంద్ర యనన్
సంగతిగఁ దగణ మయ్యె సి, రంగా యన యగణమయ్యె రంగనృపాలా!

31


క.

సరస యనఁగ నగణం బగు, సరసాయన సగణ మంశజాయన రగణం
బిరవొంద జితారి యనన్, మరి జగణం బయ్యె రంగ మహిపతిచంద్రా!

32


క.

సగణంబు లఘువు సలమగు, నగణంబును లఘువు నలము నగణము గురువున్
నగము గురుయుగము గగమగు, హగణము గురులఘువు వగణ మగులఘుగురువున్.

33