పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

గ్రంథప్రారంభము



రామారమణపదాం
భోరుహపూజావిశేష బుధసత్కవిమం
దారా! విపక్షశైలశ
తారా! యానందరంగధరణీశమణీ!

1


గీ.

అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార
పటిమ లన్నియు నొకటిగా ఘటనపఱిచి, లక్షణగ్రంథ మొనరింతు రంగనృపతి!

2


క.

సుకవీంద్రులు తల లూఁచఁగ, గుకవు లొగిన్ దలలు వంచుకొనఁజేసెద నే
నొకలక్షణకావ్యంబును, రకముగ నానందరంగరాట్భంద మనన్.

3


గీ.

లక్షణమెకాని యెఱుఁగరు లక్ష్యపటిమ, లక్ష్యమే కాక యెఱుఁగరు లక్షణంబు
కొంద ఱేనంద ఱానంద మొంద లక్ష్య, లక్షణము లేర్పరించెద రంగనృపతి!

4


వ.

తద్విధం బెట్టిదనిన.

5


క.

చను నుత్తమగండాధ, ర్వణహనుమదనంతసు(న)కవిరాక్షసజయదే
వనుతశ్రీధరగోక, ర్ణనీలకంఠాదిభీమనచ్ఛందంబుల్.

6


వ.

ఉత్తమగండచ్ఛందము, హనుమచ్ఛందము, అధర్వణచ్ఛందము, అనంతచ్ఛం
దము, కవిరాక్షసచ్ఛందము, జయదేవచ్ఛందము, శ్రీధరచ్ఛందము, గోకర్ణ
చ్ఛందము, నీలకంఠచ్ఛందము, ఆదిమకవిభీమనచ్ఛందము యీదశవిధచ్ఛందంబులు
గాక లక్షణగ్రంథములగు [1]నన్నయభట్టు లక్షణసారంబును, విన్నకోట పెద్దిరాజు
నలంకారశాస్త్రంబును, రఘునాధీయలక్ష్మణదీపికయును, భైరవునికవిగజాంకుశ
మును, నప్పన యాంధ్రప్రయోగరత్నాకరంబును, నెఱ్ఱాప్రెగడ కవిసర్పగారుడము
ను, దాతంభట్టు కావ్యచింతామణియును, మల్లన [2]పాదాంగచూడామణియు నను
నీ మొదలగు లక్షణకావ్యంబులందుఁ గలుగు కవితాలక్షణప్రకరణంబు లన్నియుఁ

  1. అన్నయ
  2. వాదాంగ; పాదాంగద