పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రోడీకరించి సారవంతంబుగా సకలకవిజనసమ్మతంబుగా లక్షణలక్ష్యంబు లేర్పఱచి
భవదీయ విపులకృపావిభవసంపాదిత మనీషాచాతుర్యంబున వివరించెద నాకర్ణిం
పుము.

7

గణాష్టకసంభవనిర్ణయము

క.

హరునిత్రినేత్రములం దిగ, గురువు లొదవి మగణ మయ్యె గురుతుగ వరుసన్
యరసతజభనగణంబులు, స్థిరముగ దానికి జనించె శ్రీరంగనృపా!

8


గీ.

ఆదు లచ్చులు కాదులు వ్యంజనములు, హల్లు లనఁ జెల్లు సందులో యరలవశష
సహలు నంతస్థ లూష్మ లన్ సంజ్ఞఁ దనరు, సుందరీమోహనాంగ యానందరంగ!

9

స్త్రీపున్నపుంసకాక్షరనిర్ణయము

గీ.

సక్షలును రెండు నొత్తనియక్షరములుఁ, బడియు మగలచ్ఛషలు నొత్తఁబడినపదియు
రమణు లౌ ఙఞణనమయరసహలళలు, రహిని బేడులౌ నానందరంగశౌరి.

10


వ.

సకారక్షకారములు రెండు నొత్తనియగరము లగుకగచజటడతదపబయనునీపది
యును గూడఁ బండ్రెండక్షరములు పురుషజాతివి. ఆకారాదిస్వరములు పదునైదు,
నొత్తుగలయక్షరములు పదియును, శషలు రెండును మొత్త మిరువదేడక్షరములు
స్త్రీజాతివి. ఙఞణనమయరలవహళయను నీపదునొకండక్షరములు నపుంసకజాతివి
అని తెలియునది. మఱియు నీశ్వరునిమూఁడుకన్నులనుండి మూఁడుగురువులు పుట్టి
మగణ మాయెను. దానివలన వరుసగా యగణరగణసగణతగణజగణభగణనగణం
బులు పుట్టెను.

11

గణంబు లుద్భవించిన యామములు

గీ.

సరవిని జయవిజయశంఖమహాశంఖ,ము లను జాల మయరసలు జనించె
రాత్రిజాము లైనరామవిరామసు, ప్తప్రసుప్తలఁ దజభనలు పుట్టె.

12


క.

ఏజామునఁ గృతిఁ బూన్చిన, నాజాముగణంబె మొదట నమరింపక వే
ఱే జెప్పఁదగదు సద్గుణ, రాజిత యానందరంగ! రమణీయాంగా!

13


వ.

ఆయెనిమిదిగణములు నెనిమిదిజాములయందుఁ బుట్టినవి గనుక నందుఁ బగటిజాము
లయిన జయవిజయశంఖమహాశంఖముల మగణయగణరగణసగణంబు లుద్భవించె.
రాత్రిజాము లయినరామవిరామసుప్తప్రసుప్తలయందుఁ దగణజగణభగణనగణం
బులు జనియించినవి. కాన సుకవీంద్రుఁ డేవేళఁ గృతిసేయ నుపక్రమించె నా
వేళఁ బుట్టినగణమును పద్యాదిని బ్రయోగించినఁ గృతీశ్వరునకుఁ దనకు మేలుగలు
గును. భేదముగాఁ జెప్పినఁ గీడొదవును.

14