పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాఱింట రవిబుధు లలసప్తమమున బృహస్పతికవిరాహు లష్టమమున
మహితనూజుఁడు నవమమునఁ జంద్రుఁడుగతి మనసార్వభౌమయోగం బెసంగ


తే.

రాయసింహాసనాసీన రంగపతికి
శ్రీమదలమేలుమంగాసతీమణీకిని
రమణ ముద్దువిజయానందరంగరాయ
చంద్రుఁ డుదయించె సత్కళాసాంద్రుఁ డగుచు.

85


సీ.

ఈధన్యుఁడేకదా యెలమి సాక్షాద్విష్ణువంశచే నుదయించినట్టిదేవుఁ
డీఘనుఁడేకదా యిల ఢిల్లిపాచ్చాయిచేతఁ బూజలు గాంచు శ్రీనిధానుఁ
డీరాజరాజేగదా రాజసింహాసనోద్దామసామ్రాజ్యయోగశాలి
యీమహామహుఁడేగదా మేటిమండలాధీశులమ్రొక్కు లంచెడికెరీటి


తే.

యనుచు సకలమహీపాలు రభినుతింప, శుక్లపక్షస్ఫురత్సుధాంశువలె దినది
నప్రవృద్ధి ముద్దువిజయానందరంగ, రాయమణి పట్టభద్రుఁడ్రై రహిఁ జెలంగు.

86


క.

ఈలీల నిరుపమానమ, హాలక్ష్మణశాలి యగుచు నతఁ డొదవినయా
వేళం దనరునవగ్రహ, లీలావసరములు నేర్పరించెద వేడ్కన్

87


వ.

తద్విధంబు.

88


సీ.

రతనంబులను జాల జతనమౌ మొలనూలు బలుకిరీటంబు సొమ్ములు చెలంగఁ
దెలిచల్వఁ గట్టి ముత్తియపుఁబేరులు దాల్చి మురువైన సంగోలు పూని రత్న
సింహాసనస్థుఁడై చెనఁటివైరులఁ గొట్టి యఖిలధరామండలాధిపత్య
గర్వసంజనిత మౌఘనసంభ్రమమునందుఁ జిత్తంబు లీనతఁ జేసి మించి


తే.

తగ నజాతారి యగుచు నుత్తరముఖముగఁ
బొడవుగాంచుచుఁ గుడిక్రే యొడరఁగాను
అలుక తోఁచుట యవసరంబయ్యె కటక
లగ్నయుతకేతునపసరోల్లాస మరయ.

89


గీ.

మఱి చతుర్ధాధిపతి శని సరిగె కంబి, నీలివలువకిరీటభూషాదిఁ దాల్చి
తూర్పు గని కుడికాలు ముందుంచి నిల్చి, యమరకేతుపట్టము గట్టు నవసరంబు.

90


సీ.

మఱియు నయ్యాఱింట మెఱయుచున్న బుధుండు లలిమీఱఁ బసపు దల్లడముఁ బూని
బలుతోలుకుళ్లాయిపై నిన్పగొల్సును జుట్టి జందెంబువేసుకొని విల్లు
నమ్ము చేఁ బూని యాయనిలునిదెస కేగి బలిమి సమస్తభూముల జయించి
యాగ్నేయదిక్కున కందుండి చనుదెంచి గగనమండలమున కెగసి నిలిచి


తే.

దక్షిణాభిముఖంబుగాఁ దనరి యూర్ధ్వ, దృష్టి గైకొని శరము సంధించి మించి
పంతమున ముజ్జగముల దహింతువనుచు, నాగ్రహావేశమున నుండునవసరంబు.

91