పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కాకయుండిన విటులు లక్షలకొలంది, నిచ్చి యర్ధులఁ దనియింప నెవరిశక్య
మని జనంబులు దనకీర్తి వినుతిసేయఁ, బ్రబలు జితవైరి యానందరంగశౌరి.

69


శా.

ఆంతం జెంగలిపట్టునం దనరు శేషాద్రీంద్రుసత్పుత్రి యౌ
కాంతారత్నము రూపవిభ్రమకళాకారుణ్యదాక్షిణ్యవి
శ్రాంతిన్ లక్ష్మిని మించు సద్గుణసమాజన్ మంగతాయీసతిన్
సంతోషంబునఁ బెండ్లియాడె విభవైశ్వర్యంబు లుప్పొంగఁగన్.

70


సీ.

సదమలపతిభక్తి సాక్షాదరుంధతి యసమానగుణముల నాదిలక్ష్మి
దీనుల పాలిటి దేవతారత్నంబు నన్నదానప్రౌఢి నన్నపూర్ణ
యాశ్రయించినవారి కమరునిక్షేపంబు పొలుపొందునోర్పున భూమిదేవి
కొనియాడువారికిఁ గొంగుబంగారంబు బంధుజనములకుఁ బారిజాత


తే.

మనుచు జను లెల్ల వేనోళ్ల నభినుతింప
సత్యమును ధర్మమును బద్దుఁ జల్లఁదనము
దయయు దాక్షిణ్యమును బూని ధరను బ్రబలు
మాననికురుంబ యలమేలుమంగమాంబ.

71


సీ.

కన్నులా చిన్నారిపొన్నారికి బిడారు చూపులా కరుణకుఁ బ్రాపు దాపు
పలుకులా సత్యసంపదలకుఁ బుట్టిలు గుణములా యమృతానకు నిలయంబు
వితరణమా సదావిశ్వవిఖ్యాతంబు శీలమా లోకప్రసిద్ధికరము
చిత్తమా బహుధర్మచింతనాయత్తంబు పుణ్యమా సౌజన్యమునకుఁ దావు


తే.

నగుచు నేసతీమణికిఁ జెన్నలరు నట్టి, శ్రీ మదలమేలుమంగమ్మ చెయ్యివట్టి
నదిమొదలు ప్రాజ్యసామ్రాజ్యపదవిరంగ, భూపతికి నాఁడు నాఁటి కుప్పొంగుకున్నె.

72


సీ.

పెండ్లియాడిన మొదల్ పెనిమిటి కైశ్వర్య మధికమై వెలసినయతిశయంబు
చేపట్టినది మొదల్ చెలువునకును గీర్తి విస్తరిల్లుచు వచ్చు విస్మయంబు
బొట్టుగట్టిన మొదల్ పురుషునకును మండలాధిపత్యము వచ్చు నద్భుతంబు
చేకొన్నయది మొద ల్చెలఁగి భర్తకు దొరా దొరలెల్ల స్వవశులై పరఁగువింట


తే.

యింతయని కొనియాడ నెవరివశము, మహితలక్షణవతి యైన మంగతాయి
యాదిలక్ష్మియె నిజము కాదనిన నెట్లు, రంగశౌరికిఁ బట్టంపురాణి యగును.

73


క.

అని జనములు దనుఁ బొగడఁగ, ఘనతరగోభూహిరణ్యకన్యాదానా
ద్యనుపమదానంబులు భ, క్తిని భూసురకోటి కొసఁగి కీర్తిఁ జెలంగున్.

74


వ.

అంత.

75


గీ.

సీమలోనుండి ఫ్రాన్సురాట్శేఖరుండు, పసిఁడిబెత్తంబు భూషణాంబరము లనిచి
కుంపినిదుబాసితన మీయ సొంపుమీఱి, రహి చెలఁగమీఱి యానందరంగశౌరి.

76