పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మనుచరిత్ర
సీ.

కటికిచీఁకటి తిండి కరముల గిలిగింత నెవ్వాఁడు తొగకన్నె నవ్వఁ జెనకు....

80


వ.

అని యున్నది గనుక జాడ తెలియునది.

81


గీ.

అగును స్త్రీలింగశబ్దంబు హ్రస్వముగ స, మాసమధ్యంబునను రంగ మనుజవిభుని
కీర్తి హరజటాజూటసంకీర్ణదివ్య, గంగజలముల మితి మీఱు గరిమ ననఁగ.

82


తా.

గంగాజలము, గంగజలము; తమసాతీరము, తమసతీరము; రాకాచంద్రుఁడు, రాకచంద్రుఁడు, నదీసుతుఁడు, నదిసుతుఁడు అని యీరీతి స్త్రీలింగశబ్దములు అకారాంత, ఇకారాంతశబ్దములవలె నుండవచ్చును.

లక్ష్యము, భారతమున, ఆది పర్వమున
చ.

జలరుహనాభ రమ్యగిరిసానువనంబుల వేఁట లాడుచున్
సలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను [1]నెమ్మదిన్
నలినరజస్సుగంధియమునా హ్రదతుంగతరంగసంగతా
నిల శశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ్యరేఖలన్.

83
రాఘవపాండవీయమున
క.

నెలకొనియె వేఁటతమి న, బ్బలియుఁడు శిశిరనగరుచిరపరిసరమహిమం
గలతమసతీరసికతా, విలసనములు డెందమునకు విందొనరింపన్.

84
శృంగారనైషధమున
ఉ.

రాకసుధాంశుమండలమురాకకు మాఱుమొగంబు పెట్టుచో
దీకొనివచ్చు దండధరదిక్పనమాన మదక్షిణంబగున్...

85


వ.

అని యున్నది గనుక జాడ తెలిసికొనునది.

86

వృత్తరత్నాకరప్రకరణము

క.

క్షితి వృత్తనియమములసం, గతి విద్వజ్జనము లెన్న గణబద్ధములై
ధృతివెలయఁ జెప్పెద వజ, రతవిజయానందరంగరాయబిడౌజా!

87


గీ.

ధరను బ్రస్తార మనఁగ నధ్వం బనంగ, నష్టమన సంఖ్యయనఁగ నుద్దిష్ట మనఁగ
విను లగక్రియ యన నాఱువిధములుగును, ప్రత్యయము లొప్పు నానందరంగశౌరి.

88


తా.

ప్రస్తారప్రత్యయము, అధ్వప్రత్యయము, నష్టప్రత్యయము, సంఖ్యాప్రత్యయము, ఉద్దిష్టప్రత్యయము, లగక్రియాప్రత్యయము, అని యాఱువిధముల ప్రత్యయము లొప్పును. అందుఁ

  1. నున్మిష, న్నలిన.