పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అశ్వోత్తమము, అశ్వోత్తముఁడు; గజేంద్రము, గజేంద్రుఁడు; అనియు నిదియఁ గాక ఉరగము, ఉరగుఁడు; సముద్రము, సముద్రుఁడు; ఘనము, ఘనుఁడు; అనియుఁ జెప్పవచ్చును.

లక్ష్యము భారతము, సౌప్తికపర్వమున
ఉ.

అగ్గురునందనుండు హరిణావళిఁ గాంచి కుభృత్తటంబు వే
డిగ్గుమృగేంద్రుచాడ్పునఁ గడిందిమగంటిమి యుల్లసిల్లఁగా...

64
భారతము, ఆదిపర్వమున
మ.

వివిధోత్తుంగతరంగఘట్టనచలద్వేలావనైలావళీ
లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు వీక్షించుచున్
ధవళాక్షుల్ చని కాంచి రంత నెదుటన్ దత్తీరదేశంబునం
దవదాతాంబుజఫేనపుంజనిభు నయ్యశ్వోత్తముం దవ్వులన్.

65
భారతము, ఆరణ్యపర్వమున
క.

గిరిశృంగతుంగవిగ్రహుఁ, డురుతరసత్త్వుఁడు విహంగమోత్తముఁ డపు డొ
క్కరుఁ డొయ్యన నయ్యెడకున్...

66
భారతము, ఆదిపర్వమున
చ.

అరిదితపోవిభూతి నమరారులఁ బాధలు వొందకుండఁ దా
నురగులనెల్లఁ గాచినమహోరగనాయకుఁ డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషితంబయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

67
భారతము, ఆరణ్యపర్వమున
క.

మృగయార్థ మరిగి హిమవ, న్నగభూములయందుఁ బవననందనుఁ డొకప
న్నగుచేతఁ జిక్కు వడి యి, మ్ముగ ధర్మజుచేతఁ దాను మోచితుఁ డయ్యెన్.

68


వ.

అని యీతీరున విస్తారముగా నున్నది గనుకఁ దెలిసికొనఁదగినది.

69


గీ.

పడెఁ బఱచెఁ బట్టెఁ బాటను నుడువు మెకట, సంస్కృతంబునఁ జెల్లును శత్రువులను
భంగపడఁజేసి యానందరంగనృపతి, ధీజనులకష్టపాటెల్లఁ దీర్చు ననఁగ.

70


తా.

పడె, పఱచె, పట్టె, పాటు ఈ నాల్గుశబ్దములు సంస్కృతపదములన్నిటియందుఁ జేరియుండవచ్చును. సుఖపడె, సుఖపఱచె, సుఖపెట్టె; దుఃఖపడె, దుఃఖపాటు, దుఃఖపెట్టె, దుఃఖపఱచె; సంకటపడె, సంకటపఱచె, సంకటపెట్టె; భంగపడె, భంగపెట్టె, భయపఱచె; అని యిటువంటిశబ్దములమీఁద నొకసమాసమువలె నుండవచ్చును.