పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

పదాఱు+వన్నె=పదార్వన్నె; నలు+మోములు=నల్మోములు; వారు+పరమమునులు=వార్పరమమునులు; కను+కొనలు=కన్గొనలు; పలు+మాఱు=పల్మాఱు. అని యిట్లు నుకార రుకార లుకారము లంతమందుఁగ తెనుఁగుశబ్దములు సమాససంధిచేత ద్విత్వములు గూడ నగును.


క.

తెల్లంబుగను నకారపుఁ, బొల్లులకు న్నచ్చుసంధి పొసఁగుఁ గవులకున్
గొల్లలుగ రంగధరణీ, వల్లభుఁ డిచ్చు న్నపారవస్తువు లనినన్.

6


తా.

నకారపొల్లువెనుక నచ్చులయినయకారాదు లుండిన సంధి పొసఁగును.

లక్ష్యము భారతము, ఆదిపర్వమున
మ.

అనిలం బాపురిపౌరచిత్తముల కత్యానంద మొందంగనం
దిని యన్నేటితరంగలం బెనఁగుచున్ దివ్యద్రుమాకీర్ణనం
దనసందోహము దూరుచున్ వికచకేతక్యాదినానాలతాం
తనవామోదము నొందుచు న్నెగయు నిత్యంబున్ గరం బిష్టమై.

7
మఱియు భారతము, ఆరణ్యపర్వమున
చ.

వరదుఁడు పార్థుశౌర్యవిభవంబున కాతనిధైర్యశక్తికి
న్నరుదుగ మెచ్చి సన్నిహితుఁ డయ్యె జటామకుటేందురేఖయున్
గరమున శూలముల్ గరళకాలగళంబు బృహద్గజాజినాం
బరముఁ దృతీయలోచనముఁ బన్నగహారము లొప్పుచుండఁగన్.

8
భారతము, ఆదిపర్వమున
మత్త.

మానితం బగునాతపోమహిమం ద్రిలోకపరాభవం
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్కప్రతిజ్ఞ మున్
దీని నెట్టులు గ్రమ్మఱింతు మదీయభాషణ మెన్నఁడు
న్నేని మోఘము గాదు దిగ్ధరణీందుభాను లెఱుంగఁగాన్.

9
పారిజాతాపహరణమున
క.

వచ్చిన మునిపతి కెదురుగ, వచ్చి నమస్కృతు లొనర్చి వనితయుఁ దాను
న్నొచ్చెంబు లేనిభక్తి వి, యచ్చరరిపుభేది సల్పె నాతిథ్యంబున్.

10


వ.

అని యున్నది గనుకఁ దెలియఁదగినది.

11


గీ.

హల్లుతోఁగూడ సంధిగా నచ్చుపొసఁగు, నెలమి నానందరంగరాయేంద్రుతోడ
నహితు లేలొక్కొ యీరీతి నలుకొనర్చి, వనముల వసించుచున్నవా రనుచుఁ బలుక.

12


తా.

ఏల+ఒక్కొ=ఏలొక్కొ; అలుక+ఒనర్చి=అలుకొనర్చి. అని హల్లు లైన కకారాద్యక్షరములతో నచ్చు లైనస్వరము లిముడ సంధి గూర్పవచ్చును.