పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లక్ష్యము భారతము, ద్రోణపర్వమున
మ.

వెర వేసంపదఁ గోరి గాండివగుణావిర్భూతబాణాళి కి
ట్లెరయై వచ్చుట యిమ్మహీపతి కితం డేలొక్కొ యత్యంతని
ష్ఠురశౌర్యోన్నతి నిన్నుఁ దాఁకఁదలఁపన్ జోద్యంబు వీఁ డగ్గమై
దొరకో లర్జున! నీదుతొంటిసుకృతస్తోమంబుకల్మిం జుమీ!

13
భారతము, విరాటపర్వమున
క.

జన్నములు సేయునెడఁ బ, క్వాన్నంబులు గుడుచుచుండు మధిపతి నిన్నున్
జన్నియవిడిచె రణముతఱి, [1]మిన్నక కినుకుడిగి పొమ్ము మీగృహమునకున్.

14


వ.

అని యున్నది గనుకఁ దెలియునది.

15


గీ.

క్రియలతుది రేఫ పొల్లగుఁ గృతులయందు, మదిఁ దలంతు ర్విపక్షభూమండలేంద్ర
లహరహము భవదీయశౌర్యాతిశయము, శ్రీవజారతరంగధాత్రీతలేంద్ర!

16


తా.

ఏతురు, ఒప్పుదురు, తునుముదురు, చూతురు, ఖండింతురు అనునీమొదలగు ఋకారాంతశబ్దముల రేఫ పొల్లుగాఁ గూడ నుండవచ్చును.

లక్ష్యము భారతము, శాంతిపర్వమున
మ.

పరిహాసంబునఁ దేలి భృత్యులయెడన్ బ్రహ్లాదముం జెందు భూ
వరునాజ్ఞం జన రేఁగి మెచ్చరు పనిన్ వంచింతు రెగ్గాడఁ జొ
త్తురు కౌతూహలవేషభాషణములన్ దుల్యత్వముం జెంది యే
తురు వా రెల్లపదంబు వేఁడుదురు సింతుర్భూమి మాఱొడ్డుచున్.

17
భారతమున
క.

అప్పరుసునఁ బెనఁగినరిపు, లిప్పుడు భారతరణోర్వి కెర యై పలువుర్
కుప్పలు గొనఁబడి రనికిన్, దప్పినవాఁ డొకఁడొకండు ధర నింతంతన్.

18


వ.

అని యున్నది గనుక జాడ తెలియునది.

19


గీ.

క్రియ విభక్త్యవ్యయములు సంస్కృతములు గను
దెనుఁగునందుండు శ్రీరంగ ధీవరాయ
భూపచంద్రాయ 'తుభ్యన్నమో' యటంచు
నహితు లేప్రొద్దు మ్రొక్కుదు రనుచుఁ బలుకు.

20


తా.

క్రియలుగ నుండునవియు, విభక్తిరూపములుగ నుండునవియు, నన్వయములుగ నుండునవియు నగుసంస్కృతశబ్దములు తెనుఁగున నొక్కొక్కదిక్కున ననుకరణమునందుఁ బ్రయోగింపవచ్చును.

  1. మిన్నకుడిగి మగుడిపొమ్ము