పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాశీఖండమున
క.

అంగీకరించు మనుజుఁడు, సాంగోపాంగాధ్వరక్రియాఫలము వియ
ద్గంగాపులినంబున శివ, లింగార్చన మాచరింప లెస్సఁగ శౌరీ!

215
మనుచరిత్రమున
శా.

సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిం బయిం బంచినన్
స్వాహాకాముకుఁ డౌట...

216
అథర్వణాచార్యులు
గీ.

అనవరతమును బూజించి సాంబశివుని
దలఁపఁ దలఁపులు ఫలియించుఁ గలుష మణఁగు.....

217


వ.

అని యనేకప్రబంధములయందుఁ చాలా చెప్పియున్నది గనుక సూచన వ్రాసినాను.

218

ఆదేశయతి

కవిరాక్షసచ్ఛందంబున
గీ.

ద్వీప నా కాంతరీప ప్రతీపశబ్ద, ములకు నచ్చుహల్లులకు యతులు చెలంగు
నితఁడు పటుశక్తి జాంబవద్వీప మేలి, నాకవాసులచే నుతు లందె ననఁగ.

219


తా.

ద్వీప నాక అంతరీప ప్రతీప ఈశబ్దముల హల్లులలో అచ్చు లిమిడియుండుటచేత రెంటికిని యతులు చెల్లును.

లక్ష్యము
గీ.

ఎలమి సత్కీర్తి జాంబవద్వీపమునకు, భర్త యగుపాదుషాచేతఁ బ్రణుతులంది
నాకపతివైభవముఁ బూని యమరి తౌర, రసికమందార! యానందరంగధీర!

220
మఱిన్ని, పెద్దిరాజు అలంకారమున (7-65)
ఉ.

ద్వీపులఁ ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటచేఁ బ్రసన్న యై
గోపతిధేను వవ్విభునకున్ దనవైభవ మిచ్చెఁగాక యే
భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్ర, సిద్ధి వహించి రుర్వరన్.

221
మఱిన్ని, అందే
క.

నీకరవాలముపాలై, నాకంబున కేఁగి రాజి నారాయణ యా
భూకాంతు లెట్టి చనవో, నాకవిటోత్తములఁ దూల వడుతురు లీలన్.

222