పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భాస్కరరామాయణమున
క.

నాకులజుఁ డైన రాముఁడు, శ్రీకంఠునివిల్లు విఱిచి సీతను ప్రేమన్
గైకొను రే పని చెప్పఁగ, నాకమునకు నరుగువిధమునన్ రవి గ్రుంకెన్.

223
రంగనాథరామాయణమున
ద్వి.

నాకీశ మొదలమున్నాఁడఁ బల్కితివి.

224


వ.

అని చాలాదిక్కుల నుదాహరణము లున్నవి గనుక సూచన తెలుసుకోగలది.

225

ప్రభునామాఖండయతి

అనంతచ్ఛందంబున (1-120)
గీ.

ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక, ద్వివిధమగుఁ బ్రభునామాంతవిరమణంబు
మహి నయోధ్యకు రాజు రామన యనంగ, నతనిపట్టపుదేవి సీతమ యనంగ.

226
మఱిన్ని, నీలకంఠచ్ఛందంబున
క.

తెనుఁగున నామాంతరములఁ, గనుపట్టెడి స్వరముఁ జెప్పఁగాఁ దగుహల్లున్
జనువళ్లకు రంగన సిం, గన యనఁగన్ వరుసతో నుదాహరణంబుల్.

227


తా.

రామన, రామయ, సీతక, సీతమ అని యొకరిపేరితో కూడి తేలికగా బలుకఁబడిన శబ్దముల యచ్చులకు హల్లులకు యతి చెల్లును.

లక్ష్యము
గీ.

అవనిలో నలమేలుమంగమకు సాటి, యాదిలక్ష్మి యానందరంగనకు సాటి
విష్ణు వటుగాన నోములు వేయు నోచి, మహిమ నాతనిఁ గన్నలక్ష్మమదె కీర్తి.

228
కాశీఖండమున
మ.

అనవేమాధిపురాజ్యభారభరణవ్యాపారదక్షుండుఁ బె
ద్దనమంత్రీశుఁడు మామిడన్నసుతుఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్.

229
ఎఱ్ఱాప్రగ్గడ హరివంశమున
చ.

నగినగియేనియున్ విను జనార్దన యెన్నఁడు బొంకు వల్క మ
త్యగణితవిక్రమోరుబలధైర్యసమగ్రుల మట్లు గాక కా
లగతిఁ దొలంగఁ ద్రోవఁగఁ దలం బగునే యగుగాక నీకు మె
చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము స్రుక్కము చావున కాత్మ నేమియున్.

230


వ.

అని యనేకప్రబంధములయం దున్నది.

ఘఞ్ యతి

నన్నయభట్టు లక్షణసారమున
గీ.

అచ్చు హల్లును లాపశబ్దాదివర్ణ, ములకుఁ జెప్పిన ఘఞ్ యతు లనఁగఁ దనరు
నంబురుహగేహిని మధురాలాప యనఁగ, లక్ష్మి వాగ్జితకోకిలాలాప యనఁగ.

232