పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
2


ఆంధ్రరాష్ట్రం అవతరించడంతో మద్రాసు నుండి వేరు పడ్డాయి. తెలంగాణా ప్రాంతం నైజాం పాలనలోని హైదరాబాదు సంస్థానంలో ఉండేది. కాని 1956 నవంబరు 1 న హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడంతో తెలంగాణా ప్రాంతం విశాలాంద్రలో భాగంగా మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో అత్యధికులు వ్యవహరించే భాష తెలుగు దాదాపు 88 శాతం ప్రజలు తెలుగు భాషలో వ్యవహరిస్తారు. రాష్ట్రంలో తెలుగు తర్వాత రెండవ స్థానాన్ని ఉర్దూ భాష ఆక్రమించింది. దాదాపు 7 శాతం ప్రజలు ఉర్దూ భాష మాట్లాడుతారు. దాదాపు 88 శాతం ప్రజలు హిందువులు కాగా 7 శాతం ముస్లింలు, 4 శాతం క్రైస్తవులు వున్నారు. సిక్కులు, బౌద్ధులు, పారశీకులు కలసి ఒక శాతం ఉన్నారు.

పూర్వచరిత్ర

క్రీ. పూ. 1000 సంవత్సరాల నాటిదైన ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా ఆంధ్రులను గూర్చిన ప్రశంస కనిపిస్తుంది. సునశ్శేపుని దత్తత తీసుకోవడానికి అంగీకరించిన తన 50 మంది కుమారులను విశ్వామిత్రుడు బ్రాహ్మణవర్గం నుండి బహిష్కరించాడు. ఈ విధంగా బహిష్కరించబడ్డ విశ్వామిత్ర సంతతకి చెందిన వారుగా ఆంధ్రులతో పాటు పుండ్రులు, సవరులు, పుళిందులు, మూతిబుల్ని పేర్కోవడం జరిగింది. మహాభారత యుద్దంలో ఆంధ్రులు, కౌరవుల పక్షాన నిలిచిపోరాడినట్లు తెలుస్తున్నది. ధర్మరాజు చేపట్టిన రాజసూయయాగంలో భాగంగా సహదేవుడు ఆంధ్రరాష్ట్రాన్ని కూడ జయించినట్లు పేర్కొనడం జరిగింది.

ఆంధ్రదేశంలో చారిత్రక యుగం మౌర్యుల పాలన నుండే ప్రారంభమయిందని చెప్పవచ్చు. మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్రదేశం ఒక భాగంగా ఉండేది. కర్నూలు జిల్లా యందలి ఎర్రగుడిలో కన్పించే అశోకుని శాసనాన్ని దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాయబారిగా వుండిన మెగస్తనీసు తాను రచించిన 'ఇండికా' అన్న గ్రంధంలో పలుచోట్ల ఆంధ్రులను గూర్చి ప్రస్తావించాడు. ఆంధ్రులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కల్గి, సర్వస్వతంత్రులై ఉండేవారని మెగస్తనీసు రచనవల్ల