పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

భారత దేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడంలో పోర్చుగీసు నావికులు ముందంజ వేశారు. పోర్చుగల్‌ రాజైన హన్రీ గొప్ప నావికుడుగ ప్రసిద్ధి చెందాడు. ఆయన భారత దేశానికి సముద్రమార్గాన్ని కనుగొనేందుకు పోర్చుగీసు నావికుల్ని ప్రోత్సహించాడు. హెన్రీ ప్రయత్నాలు క్రీ. శ 1498లో సఫలీకృత మయ్యాయి. వాస్కొడిగామా అను పోర్చుగీసు నావికుడు 1498 లో భారత దేశపు పశ్చిమ తీర ప్రాంతమైన కాలికట్‌ కు చేరుకున్నాడు. దీంతో చిరకాలంగా ఎదురుచూచిన కొత్త సముద్ర మార్గం కనుగొన బడింది.

కాలికట్‌ రాజైన జమోరిన్‌ పోర్చుగీసు వారికి హృదయ పూర్వకంగా స్వాగతం పల్కాడు. మరికొంత కాలానికే కాలికట్‌, కొచ్చిన్‌, కన్ననూరు ప్రాంతాల్లో పోర్చుగీసువారు తమ వ్యాపార కేంద్రాల్ని స్తాపించారు. భూమార్గం మీదుగా యూరపులో సాగుతున్న ఆసియా వ్యాపారాన్నంతా ముస్లింల నుండి కైవశం చేసుకుని తాము కనుగొన్న కొత్త సముద్ర మార్గానికి మళ్లించడం, ఇండియాతోనేగాక తదితర తూర్పు దేశాలైన ఆగ్నేయాసియా, చైనా వంటి దేశాలతో కూడ తమ వ్యాపారాన్ని విస్తృత పరచడం వంటివి పోర్చుగీసువారు తమ ప్రదాన లక్ష్యాలుగ పెట్టుకున్నారు.

క్రీ. శ. 1500 - 1509 సంవత్సరాల మధ్య కాలంలో హిందూ మహా సముద్రంపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడంలో పోర్చుగీసువారు సఫలీకృతులయ్యారు. క్రీ. శ. 1503లో వారు కొచ్చిన్‌ వద్ద ఒక నౌకా స్థావరాన్ని ఏర్పరచుకొన్నారు ఆ తర్వాత సంవత్సరములోనే ఇండియాలోని పోర్చుగీసు ప్రాంతాలకు రాజప్రతినిధిగా నియమింప బడ్డ ఫ్రాన్సిస్‌ది ఆల్మైడా కొచ్చిన్‌ చేరుకున్నాడు. ఆయన తన కున్న వనరుల్ని భారతదేశంలో వలస రాజ్యాన్ని స్థాపించడం కోసం వినియోగించ కూడదనుకున్నాడు. సముద్రంపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ వ్యాపారాన్ని వృద్ది చేసుకోవాలని భావించాడు. అందుకే పోర్చుగీసువారు తమ కార్యకలాపాల్ని వ్యాపారం వరకే పరిమితం చేసుకున్నారు. ఆల్మైడా అనుసరించిన ఈ పద్ధతినే 'నీలి నీటి విధానం' (Blue Water Policy) అని వ్యవహరిస్తారు.

ఆల్మైడా తర్వాత రాజ ప్రతినిధిగ వచ్చిన ఆల్పన్సోడీ అల్బూకర్క్‌ నీలి నీటి విధాన్ని పూర్తిగా త్రోచిపుచ్చి భారతదేశంలోని భూభాగాల్ని ఆక్రమించడానికి ఉపక్రమించాడు. క్రీ. శ. 1510లో గోవాను, 1511లో మలక్కా దీవిని