పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

వ్యవహరించడం జరిగింది హైదరాబాదులోని ముఖ్య కట్టడమైన చార్మినార్‌ ఇతని కాలంలో నిర్మింపబడ్డదే. ఈయన తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన ముహమ్మదు క్రీ. శ 1612 నుండి 1626 వరకు రాజ్యపాలన చేశాడు

అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672)

క్రీ. శ. 1635లో మొగలు చక్రవర్తియైన షాజహాన్‌ ఆధిపత్యాన్ని అబ్దుల్లా అంగీకరించవలసి వచ్చింది. ఈ సంఘటనకు ముందే 1634లోతూర్పు ఇండియా కంపెనీకి ఆంధ్రతీరప్రాంతంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఒక 'సువర్ణ ఫర్మాను'ను అబ్దుల్లా జారీ చేశాడు. అబ్దుల్లా ప్రధాన మంత్రియైన మీర్‌‌జుమ్లా ప్రభుద్రోహిగా మారి ఔరంగజేబుతో రహస్యంగా మంతనాలు జరిపాడు. దీని ఫలితంగా దక్కను ప్రాంతానికి మొగలు రాజప్రతినిధి అయిన ఔరంగజేబు 1655లో గోల్కొండపై దాడిచేసి హైదరాబాదు నగరాన్ని దోచుకున్నాడు. దీంతో అబ్దుల్లా పెద్ద మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించి ఔరంగజేబుతో సంధి కుదుర్చుకోవలసి వచ్చింది అబ్దుల్లా తర్వాత ఆయన మేనల్లుడు అబుల్‌ హసన్‌ తానీషా అధికారాన్ని చేపట్టాడు.

అబుల్‌ హసన్‌ (తానీషా) 1672-1687

అబుల్‌ హసన్‌కు ప్రధానమంత్రిగా వైష్ణవ బ్రాహ్మణుడైన అక్కన్న ఉండేవాడు. ఇతని తమ్ముడు మాదన్న సర్వసైన్యాధిపతిగా ఉండేవాడు. ఫిబ్రవరి, 1677 లో ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీతో అబుల్‌ హసన్‌ సంధి కుదుర్చుకున్నాడు మార్చి, 7, 1677న శివాజీ హైదరాబాదును సందర్శించాడు ఆ సమయంలో శివాజీని తానీషా విశేషంగా ఆదరించి సన్మానించాడు ఇది పసిగట్టిన ఔరంగజేబు 1687 లో గోల్కొండపై దండెత్తి వచ్చాడు. మతోన్మాదులైన కొందరు ముస్లింలు అక్కన్న, మాదన్నల్ని చంపేశారు. అబ్దుల్‌ రజాక్‌ అనే సేనాపతి గోల్కొండ దుర్గాన్ని సమర్దవంతంగా కాపాడాడు. ఏడునెలల ముట్టడి తర్వాత కూడ గోల్కొండ దుర్గం ఔరంగజేబు వశం కాలేదు దీంతో ఔరంగజేబు విశేషంగా లంచమిచ్చి కోటలోనికి ప్రవేశించగలిగాడు. అబ్దుల్‌ రజాక్‌ ధైర్యసాహసాలతో పోరాటం జరపినా ఫలితం లేకపోయింది. కాని రజాక్‌ ఔరంగజేబు క్రింద పనిచేయడానికి ఒప్పుకోలేదు. తానీషా బందీ అయ్యాడు