పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

మూలకారకులయ్యారు. కర్ణాటకప్రాంతంలోవీరశైవం వీరవిహారం చేయడంతో మతసంఘర్షణలు మొదలై రక్తపాతానికి దారితీసింది. ఈ ప్రభావం నుండి ఆంధ్రదేశం గూడ తప్పించుకోలేకపోయింది. శైవులకు, జైనులకు మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. అనమకొండలోని 'పద్మాక్షి ' ఆలయంతోపాటు అనేక జైన ఆలయాలు శివాలయాలుగా మార్చబడ్డాయి. రెండవ ప్రోలయ తర్వాత వచ్చిన కాకతీయ రాజులు గొప్ప శైవభక్తులుగా మారారు. కాని వీరు ఎప్పుడూ మత మౌఢ్యంతో ప్రవర్తించలేదు. జైనులకు శైవులకు మధ్య తలెత్తిన అనేక వివాదాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు.

ఒక్కమాటలో కాకతీయుల పాలన ఆంధ్రదేశనికి, తెలుగుభాషకు ఒక ప్రత్యేక అస్థిత్వాన్ని కులుగజేసిందని చెప్పవచ్చు.

విజయనగర సామ్రాజ్యం (క్రీ.శ. 1336-1678)

కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ముస్లిం పాలకుల నిరంకుశత్వం మితిమీరిపొవడంతో దక్షిణ భారతంలోని ప్రజలకు ఒకరకమైన భద్రతారాహిత్య భావం కలిగింది దీనితో ఇస్లాం మతాన్ని ఎదుర్కోవడానికి హిందువులు సుసంఘటితంగా సిద్ధమయ్యారు. ఈ ప్రయత్నంలో హరిహర బుక్కరాయ సొదరులు ప్రత్యేకపాత్రను నిర్వహించారు. ఈ అన్నదమ్ముల జన్మస్ధలం వరంగల్లు కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని వద్ద హరిహరరాయలు మంత్రిగాను, బుక్కరాయలు కోశాధికారిగాను పనిచేశారు. క్రీ.శ. 1323 లో వరంగల్లును ముస్లింలు ముట్టడించడంతో ఈ సోదరులు తప్పించుకు పారిపోయారు. తుంగభద్రా నది ఉత్తరపు ఒడ్దున వెలసిన కంపిలి రాజ్యంలో వీరు తమ సేవలు నిర్వహించారు కంపిలి రాజ్యాన్ని కూడ ముస్లింలు కబళించినపుడు వీరు తుంగభద్రను దాటి వచ్చి క్రీ.శ.1336 లో 'విజయనగరం' అనే కొత్త నగరాన్ని స్థాపించారు.

విజనగరసామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు వరుసగా పాలించాయి. అవి 1) సంగమవంశం 2)సాళువ వంశం 3) తుళువ వంశం 4) అరవీడు వంశం