పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17



ప్రతాపరుద్రుడు కుటుంబసమేతంగా బందీ అయి ఢిల్లీకి పంపబడ్డాడు. కాని ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే ఆత్మహత్య చేసికొని ప్రాణాలు విడిచాడు.

వరంగల్లును ఆక్రమించిన తర్వాత ఉలుగ్‌ఖాన్ తీరం మీదుగా నెల్లూరు నుండి రాజమండ్రి వరకు గల ప్రాంతాలపై దాడి జరిపి 1324 సెప్టెంబరు కంతా కాకతీయ సామ్రాజ్యాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో వరంగల్లుతో పాటు కాకతీయ సామ్రాజ్యమంతా శత్రువుల స్వాధీనం కావడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి దీనికి తగ్గట్టుగానే ముస్లిం పాలకులు పరమనిరంకుశంగా పాలన చేశారు. దీనితో అనతి కాలంలోనే కాకతీయ సామంతులు నాయకత్వం వహించి ముస్లిం పాలన నుండి విముక్తి పొందేందుకు ఒక ఉద్యమం చేపట్టారు.

కాకతీయులు ఆంధ్రసంస్కృతికి చేసిన సేవ

ఆంధ్రుల సంస్కృతీ వికాసానికి కాకతీయులు ఎనలేని సేవ చేశారు. దాదాపు మూడు వందల సంవత్సరాలు పాలించిన కాకతీయులు ముస్లిం దండయాత్రల నుండి ఆంధ్రదేశాన్ని రక్షించి ఆంధ్రుల చరిత్రకు, సంస్కృతికి ఒక రూపం కల్పించారు.

సాహిత్యం

తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే అధికారం క్రిందికి తెచ్చి ఆంధ్రదేశానికి ఒక గుర్తింపు కలుగుజేసినవారుగా కాకతీయులు చిరస్మరణీయులు. వీరి కాలంలోనే తెలుగు భాషా సాహిత్యాలు క్రమంగా వికాసదిశలో పయనించాయి. నన్నయ రచించిన మహాభారత కావ్యమే తెలుగు భాషలో వెలువడిన మొదటి రచన. రాజమండ్రి నేలిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని కాలంలో (క్రీ. శ. 1019 - 61) నన్నయ మహాభారత రచన కుపక్రమించి పూర్తి చేయలేకపోయాడు. కాని నెల్లూరు ప్రభువైన మనుమసిద్ది ఆస్థానకవి, మంత్రియైన తిక్కన మహాభారతంలో మిగిలిన 15 పర్వాల్ని పూర్తి చేశాడు. మనుమసిద్దిని గద్దె నెక్కించేందుకు గణపతి దేవుని సహాయం కోరి వరంగల్లుకు వచ్చి అక్కడే ఈ 15 పర్వాల్ని పూర్తిచేయడం విశేషం

విద్యానాధుడు, సత్కల్యమల్లుడు, పాల్కురికి సోమనాధుడు, భాస్కరుడు వంటి ప్రసిద్ది చెందిన కవులు కాకతీయుల కాలంలో వెలసిన వారే. మొదట