పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
16



నరికించి అధిక భూభాగాన్ని వ్యవసాయాయోగ్యంగాను, నివాసయోగ్యంగాను తీర్చి దిద్ది కొత్త గ్రామాల్ని నిర్మించాడు. తెలంగాణా, కోస్తా ప్రాంతాల ప్రజల్ని ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడేందుకు ప్రోత్సహించాడు. ఈ ప్రాంతాన్ని ఒక 'నాయంకర'గ రూపొందించి స్థానిక ముఖ్యుడైన వీడెము కొమ్మరాజుకు పాలనా బాధ్యతల్ని అప్పజెప్పాడు.

రాయలసీమలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత ప్రతాపరుద్రుడు కంచిపైన, పాండ్యరాజులపైన దండయాత్ర చేశాడు. కంచిని స్వాధీనం చేసికొని వీరపాండ్య, సుందరపాండ్యలను ఓడించాడు. ప్రతాపరుద్రుడు మాలిక్‌కపూర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతిఏటా ఢిల్లీ సుల్తానుకు కప్పం కట్టేవాడు. క్రీ. శ. 1316 లో అల్లాయుద్దీన్ మరణించడంతో సింహాసనం కోసం పోరాటం ప్రారంభమైంది. దీన్ని ఆసరగా తీసుకుని ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు కట్టవలసిన కప్పాన్ని నిలిపివేశాడు. అయితే క్రీ. శ. 1318 లో కుతుబుద్దీన్ ముబారక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. సుల్తానుకు కట్టాల్సిన కప్పాన్ని రాబట్టుకునేందుకు ఖుస్రూ ఖాన్ నాయకత్వంలో వరంగల్లుపైకి తన సైన్యాన్ని పంపాడు. ఈ సమయంలో ప్రతాప రుద్రుడు కంపిలి రాజైన కుమార రాజుతో యుద్దంలో వున్నందున డ్లిల్లీ సుల్తాన్‌తో సంధి కుదుర్చుకుని, కట్టాల్సిన కప్పాన్ని పూర్తిగా చెల్లించాడు.

క్రీ. శ. 1320 లో ఢిల్లీ సింహాసనంపై ఖిల్జీల అదుప తప్పడంతో తుగ్లకులు అధికారం చేపట్టారు. ఘియాసుద్ధీన్ ఢిల్లీ సుల్తానయ్యాడు. కప్పం విధించే విషయంలోను, రాజ్యాక్రమణ విషయంలోను దక్కను ప్రాంతంలో అనుసరించవలసిన వ్యూహాన్ని ఘియాసుద్ధీన్ మార్చేశాడు. ఈ మధ్యలో ప్రతాపరుద్రుడు మరల సుల్తానుకు కట్టవలసిన కప్పాన్ని నిలిపివేశాడు. అంతే కాకుండ ఖిల్జీ గవర్నరైన ఖుస్రోకు తాను దత్తం చేసిన చాదర్‌కోట మొదలగు ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. క్రీ. శ. 1321 లో ఢిల్లీ సుల్తాన్ తన కుమారుడైన ఉలుగ్‌ఖాన్ నాయకత్వంలో అతిపెద్ద సైన్యాన్ని వరంగల్లుపైకి పంపాడు. కాని ఈ దాడిని వరంగల్లు సైన్యం తిప్పికొట్టడంతో ఢిల్లీ సైన్యానికి విపరీతమైన నష్టం కల్గింది. ఢిల్లీ సైన్యం తిరుగుముఖం పట్టింది. అయితే తర్వాత నాలుగు నెలలకే ఢిల్లీ సైన్యం వరంగల్లుపై దాడిచేసి విజయాన్ని సాధించింది.