పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15



'నాయంకార పద్దతి' అంటారు. కాని ప్రతాపరుద్రుడు ఈ ఆచారానికి స్వస్తిపల్కి కేవలం పద్మనాయక కులం నుండే నాయకుల్ని నియమించాడు. ఇతర కులాల నాయకుల్ని తొలగించాడు. క్రీ. శ. 1303 లో ఉత్తర భారతం నుండి ముస్లింలు దండయాత్ర చేయడంతో ప్రతాపరుద్రుని సంస్కరణా కార్యకలాపాలకు ఆటంకం కల్గింది. క్రీ. శ. 1303 నుండి క్రీ. శ. 1323 వరకు కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ పాలకులు అయిదుసార్లు దండయాత్ర చేశారు. ఈ దండయాత్రల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమయింది.

యాదవరాజ్యమైన దేవగిరిపై విజయం సాధించిన తర్వాత క్రీ. శ. 1296 లో అల్లాఉద్దీన్ ఢిల్లీ సింహాసనాన్ని చేపట్టాడు. కార, అలహాబాదు ప్రాంతాల గవర్నరుగా ఉన్నప్పుడు అనధికారంగా అల్లాఉద్దీన్ దేవగిరిపై దండయాత్రను నిర్వహించాడు. ఈ యుద్దంలో విజయం సాధించిన తర్వాతనే తన మామ సుల్తాను జలాలుద్దీన్ను హత్యగావించి తన్ను తాను సుల్తానుగా ప్రకటించుకున్నాడు. దేవగిరిని సునాయాసంగా గెలవడంతో అల్లాయుద్దీన్ ఖిల్జీ మరల 1303 లో దక్షిణ భారత దండయాత్ర చేశాడు. అయితే కాకతీయ సైన్యం కరీంనగరు జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద ముస్లిం సైన్యాన్ని ఓడించింది. మరల క్రీ. శ. 1307 లో మాలిక్‌కాఫర్ నాయకత్వాన ముస్లిం సేనలు దక్షిణదేశంపై దండయాత్ర చేసి దేవగిరిని ముట్టడించడానికి ప్రయత్నించాయి. తర్వాత 1310 జనవరి 19 న వరంగల్లు కోటను మాలిక్‌కాఫరు ముట్టడించాడు. కాకతీయ సైన్యం రెండు నెలలు పాటు వీరోచితంగా పోరాడి చివరికి మార్చి 19 న లొంగిపోయి మాలిక్‌కాఫర్ విధించిన షరతులకు అంగీకరించింది. ప్రతాపరుద్రుడు తన అపార సంపదను సమర్పించడమే కాకుండా డిల్లీ సుల్తాన్‌కు ప్రతిఏటా కప్పం కట్టడానికి అంగీకరించాడు.

మాలిక్‌కాఫర్ ఢిల్లీ చేరుకోగానే రాయలసీమ లోని కాకతీయ సామంతులైన అంబరాజు (గండికోట), త్రిపురాంతకుడు (వల్లూరు) తిరుగుబాటు చేశారు. ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని నడిపించి తిరుగుబాటును అణచివేశాడు. ఈ సమయంలోనే శ్రీశైలం, త్రిపురాంతకాలలోని ప్రసిద్ధి చెందిన శివాలయాల్ని ప్రతాపరుద్రుడు దర్శించాడు. దట్టమైన అడవులతో కూడియున్న ఈ ప్రాంతాల్ని చూచి నివాసయోగ్యంగా చేయదల్చాడు. అడవుల్లోని చెట్లను