పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
14



కాకతీయ ప్రభువుల్లో గణపతిదేవుడు గొప్పవాడనటంలో సందేహం లేదు. తెలుగు భాషను మాట్లాడే చాల ప్రాంతాల్ని ఒకే అధికారం క్రిందకు తెచ్చి వ్యవసాయకంగా, వాణిజ్యపరంగానే కాక ఇంకా అనేక రంగాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికాడు. క్రీ. పూ. 1240 నుండే తన కుమార్తె రుద్రాంబను పాలనా వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేఋలు ప్రోత్సహించి చక్రవర్తిగా గణపతిదేవుడు తన విజ్ఞతను, ముందు చూపును ప్రదర్శించాడు.

రుద్రాంబ (క్రీ. శ. 1262 - 1296)

గణపతి దేవుని మరణం తర్వాత క్రీ. శ. 1262 లో రుద్రాంబ కాకతీయ సామ్రాజ్యానికి నాయకత్వం వహించింది. ఆంధ్రదేశాన్ని ఏలిన ఏకైక మహిళ రుద్రాంబ. స్త్రీ సింహాసనం చేపట్టడం ఇష్టం లేని సామంతులు తిరుగుబాటు లేవదీశారు కాని రుద్రాంబ వీటన్నింటినీ ఎదుర్కొని సామ్రాజాన్ని అవిచ్చిన్నంగా కాపాడగల్గింది.

క్రీ. శ. 1268 - 70 సంవత్సరాల మధ్య యాదవరాజైన మహాదేవుడు కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర చేశాడు. దీనివల్ల రాజ్యానికి ఏ మాత్రం నష్టం కలుగలేదు. ఏ భూభాగాన్ని వదులుకోలేదు.

క్రీ. శ. 1280 లో రుద్రాంబ తన మనుమడైన ప్రతాపరుద్రదేవుని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ని చేసింది. 1285 లో పాండ్యులు, యాదవులు, హోయసాలులు కూటమిగా చేరి కాకతీయ సామ్రాజ్యాన్ని కబళించాలని ప్రయత్నించినపుడు యువరాజు ప్రతాపరుద్రుడు వారి ప్రయత్నాన్ని విచ్చిన్నం చేశాడు.

ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1296 - 1323)

క్రీ. శ. 1296 లో రుద్రాంబ మరణించడంతో ప్రతాపరుద్రుడు రాజ్యపాలన చేపట్టాడు. తాను పరిపాలనా భాద్యతల్ని స్వీకరించిన నాటినుండే ప్రతాపరుద్రుడు అనేక సంస్కరణల్ని ప్రవేశపెట్టాడు. గణపతిదేవుని కాలంలో తన అధీనంలోని వివిధ ప్రాంతాలకు రాజప్రతినిధుల్ని నియమించి ఆయా ప్రాంతాల పాలనా బాద్యతల్ని వారి కప్పగించేవారు. వీరినే 'నాయకులు' అంటారు. ఈ నాయకుల్ని వివిధ కులాల్నుండి నియమించే ఆచారం ఉండేది. దీనినే