పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13



గణపతి దేవుడు మొదట తన దృష్టిని తీరాంధ్ర దేశంలోని వెలనాడు, వేంగి ప్రాంతాలపై మరల్చి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. కళింగ రాజ్యాన్ని కూడా కైవశం చేసుకున్నాడు. నెల్లూరు ప్రభువైన మనుమసిద్ధికి తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి సాయం చేశాడు. మనుమసిద్ధి మంత్రిగాను, మహాభారతాన్ని వెలయించిన కవిత్రయంలో ఒకరుగా పేరుపొందిన తిక్కన, గణపతి దేవుని సహాయాన్ని పొందడంలో కీలకపాత్ర వహించాడు. తన ప్రభువైన మనుమసిద్దిని గట్టెక్కించగలిగాడు. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యనాయకుడైన గంగయసాహిరిని గణపతి దేవుడు అణచివేయగలిగాడు. కంచిని స్వాధీనం చేసుకోవడం, దేవగిరి యాదవుల్ని అణచివేయడం గణపతిదేవుడు చేసిన గొప్ప కార్యాలుగా చెప్పవచ్చు.

నిరంతరం యుద్దాల్లో మునిగి ఉన్నా గణపతి దేవుడు రాజ్యపాలనలో మాత్ర అశ్రద్ద చూపలేదు. అనేక దేవాలయాల్ని కట్టించాడు. సాగునీటి పద్దతుల్ని మెరుగు పరచి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డాడు. వర్తకవ్యాపారాల్ని ప్రోత్సహించాడు. దీనికి మోటుపల్లి ఓడరేవులోని అభయశాసనాన్ని నిదర్శనంగా భావించవచ్చు. ప్రాచీనకాలంలోను, మధ్యయుగంలోను మోటుపల్లి ఓడరేవు చాల ప్రసిద్ది చెందింది. అనేక విదేశీ ఓడలు కూడా మోటుపల్లి ఓడరేవుకు వచ్చేవి. వెలనాడు పాలకుల పతనంతో మధ్య తీరాంధ్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీని అవకాశంగా తీసుకుని స్థానిక నాయకులు విదేశస్తుల నుండే గాక స్థానిక వ్యాపారస్తుల నుండి కూడ అక్రమపన్నులు వసూలు చేసేవారు. దీని ఫలితంగా ఈ నౌకాకేంద్రం మూతపడింది. వ్యాపారం క్షీణించిపోయింది. వెలనాడును స్వాధీనం చేసుకున్న తర్వాత గణపతిదేవుడు అభయ శాసనాన్ని వేయించి విదేశీ ఓడలకు రక్షణ కల్పించాడు. అక్రమ పన్నులన్నింటినీ రద్దు చేశాడు. అచిరకాలంలోనే మోటుపల్లి రేవు తన పూర్వ వైభవాన్ని పొందగల్గింది.

గణపతి దేవునికి ఇద్దరు కుమార్తెలు. కుమారులు మాత్రం లేరు. రుద్రాంబ మొదటి పుత్రిక కాగా గణపాంబ రెండవ కుమార్తె. రుద్రాంబ మాత్రం రాజ్యపాలనా వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేది. గణపతిదేవుడు దాదాపు 64 సంవత్సరాలు విజయవంతంగా పాలించి క్రీ. శ. 1262 లో మరణించాడు.