పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
12

రుద్రదేవుడు సాహిత్యాన్ని విశేషంగా ఆదరించాడు. అనమకొండలో గంభీరమైన రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. స్వయంగా సంస్కృతభాషలో నీతిసారమనే గ్రంధాన్ని రచించాడు. పాల్కురికి సోమనాధుని వంటి శైవభక్తులకు తన ఆస్థానంలో ఆశ్రయం కల్పించాడు. ఇతని పాలనలోనే రాజ్య రాజధాని అనమకొండనుండి వరంగల్లుకు మార్చబడింది. ఒకవైపు రుద్రదేవుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలో నిమగ్నుడై ఉండగా దేవగిరిని పాలించే యాదవరాజులు దక్షిణప్రాంతం వైపు చొచ్చుకు రావడం జరిగింది. జైత్రపాలుడనే యాదవరాజు క్రీ. శ. 1195 లో కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశాడు. ఈ యుద్ధంలోనే శత్రువును ఎదుర్కొంటూ రుద్రదేవుడు తన ప్రాణాలు వదిలాడు. రుద్రదేవునికి సంతానం లేనందువల్ల ఇతని తమ్ముడు మహాదేవుడు రాజ్యాధికారం చేపట్టాడు.

మహాదేవుడు (క్రీ. శ. 1195 - 1198)

రుద్రదేవుని తమ్ముడైన మహాదేవుడు మూడు సంవత్సరాలు మాత్రం రాజ్యపాలనం చేయగలిగాడు. యాదవుల రాజధానియైన దేవగిరిని ముట్టడించడంలో ఇతడు ప్రాణాల్ని కోల్పోయాడు.

గణపతి దేవుడు (క్రీ. శ. 1198 - 1262)

కాకతీయ రాజుల్లో ప్రసిద్ధుడైన రాజు గణపతి దేవుడు. తన తండ్రి మహాదేవుడు చేపట్టిన దేవగిరి ముట్టడిలో తన వంతు సహాయాన్ని అందించేందుకు తండ్రితో పాటు యుద్దభూమికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో మహేదేవుడు మరణించడమూ, గణపతిదేవుడు శత్రువులకు బందీ కావడం జరిగింది. ఈ వార్త కాకతీయ రాజ్యంలో అల్లకల్లోలం రేపింది. కాకతీయుల సామంతులు చాలమంది తిరుగుబాటు చేసి తమ స్వతంత్రను ప్రకటించడానికి ప్రయత్నించారు. కాని కాకతీయులకు విశ్వాసపాత్రుడైన సైన్యాధిపతి రేచర్లరుద్రుడు ఈ తిరుగుబాట్లను అణచివేసి రాజ్యం చీలిపోకుండా కాపాడాడు. క్రి. శ. 1202 లో గణపతి దేవుడు శత్రురాజుల చెరనుండి విముక్తుడు కావడంతో మరల యధాతధంగా రాజ్యపాలన చేసే అవకాశం కల్గింది.

దాదాపు 60 సంవత్సరాలు సాగిన గణపతి దేవుని పాలనలో ఈనాటి ఆంధ్రదేశంలోని చాలా ప్రాంతం కాకతీయుల అధికారంక్రిందికి వచ్చింది.