పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

మొదటి ప్రోలయ (క్రీ. శ. 1030 - 1075)

తన తండ్రి మరణంతో క్రీ. శ. 1030 లో సింహాసనాన్ని అదిష్టించిన ప్రోలయ చాల క్లిష్టమయిన సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. తన రాజ్యానికి చోళుల వల్ల, కళ్యాణి చాళుక్యుల వల్ల ప్రమాదం ఏర్పడింది. చక్రకూట రాజైన నాగవంశి తన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశాడు. అయినా ప్రోలయ పరిస్థితులకు ఎదురు నిలచి చక్రకూటరాజ్యంపై దండెత్తాడు. ఈరాజ్యపాలకుడైన ధారావశువును ఓడించాడు. ప్రోలయ తన 36 సంవత్సరాల రాజ్యపాలనలో తన రాజ్యాన్ని అన్నివైపులకు విస్తరించగలిగాడు. ప్రోలయ తర్వాత రాజ్యానికి వచ్చిన రెండవ బేతరాజు క్రీ. శ. 1075 నుండి 1110 వరకు రాజ్యం చేశాడు. ఇతని కాలంలో చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. రాజ్య రాజధానిని వరంగల్లు సమీపంలోని అనమకొండకు మార్చాడు. 'త్రిభువనమల్ల' అనే బిరుదును వహించాడు.

రెండవ ప్రోలయ (క్రీ. శ. 1110 - 1158)

ప్రాచీన కాకతీయ రాజుల్లో రెండవ ప్రోలయ ముఖ్యుడు. ఇతని విజయాల్ని గురించి ఇతని కుమారుడైన రుద్రదేవుడు వేయించిన అనమకొండ శాసనంలో వివరంగా వర్ణింపబడి ఉంది. ఇతడు మైలపదేవుని, గోవిందరాజును, గుండయను, జగ్గదేవుని జయించినట్లు విదితమౌతుంది. కాని ఈరాజుల్ని, వారి రాజ్యాల్ని గుర్తించడంలో చాల వాదోపవాదాలు ఉన్నాయి.

రుద్రదేవుడు (క్రీ. శ. 1158 - 1195)

తన తండ్రి రెండవ ప్రోలయ మరణం తర్వాత క్రీ. శ. 1158 లో రుద్రదేవుడు సింహాసనాన్ని అదిష్ఠించాడు. అనమకొండలోని రుద్రేశ్వరాలయంలో రుద్రదేవుడు వేయించిన శాసనంలో అతడు నిర్వహించిన దండయాత్రల్ని గురించి విపులంగా వర్ణింపబడిఉంది. తన రాజ్యం చుట్టు ప్రక్కల ఉన్న చాళుక్య రాజ్య సామంతుల్ని ఓడించినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. తూర్పున వెలనాడు ప్రభువుతోను, పశ్చిమాన యాదవ రాజులతోను రుద్రదేవుడు అనేక యుద్ధాలు చేసినట్లు తెలుస్తున్నది.