పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
10



వార్ధకులు, మాలాకారులు, దాసకులు మొదలగువారు నాలుగోవర్గంగా పరిగణింప బడేవారు.

కళాపోషణ

శాతవాహన రాజులు కళ, వాస్తు శిల్పాల్ని విశేషంగా ప్రోత్సహించారు. ప్రసిద్ధి చెందిన కన్హేరి, కార్ల, నాసిక్ గుహలు, ప్రపంచ కీర్తి బడసిన సాంచి, అమరావతి బౌద్ధ స్తూపాలు వీరి కళా పోషణకు నిదర్శనంగా నిలిచాయి. శాతవాహనుల రాజధానియైన అమరావతి పేరుమీదుగా ఒక భారతీయ కళాశైలి పిలవబడుతున్నది. అదే విధంగా అజంతా గుహల్లో కన్పించే అతిప్రాచీనమైన చిత్రకళాఖండాలు శాతవాహనుల కాలం నాటివే.

కాకతీయులు

క్రీ. శ. 3 వ శతాబ్దిలో శాతవాహనుల సామ్రాజ్యం అంతరించిన తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యుల వంటి చిన్న చిన్న రాజవంశాలు దాదాపు 700 సంవత్సరాలు పాలించాయి. క్రీ. శ. 11 వ శతాబ్దిలో వరంగల్లులో కాకతీయుల అధికారస్థాపనతో ఆంధ్రుల చరిత్రకు, నాగరికతకు రూపుదిద్దగల నాయకత్వం ఆంధ్రదేశానికి లభించింది.

కాకతీయుల పుట్టుపూర్వోత్తరాల్ని గురించి కూడ వాదోపవాదోలున్నాయి. 'కాకతీయ' అన్న పేరు వరంగల్లు పాలకులు పూజించే 'కాకతి' అను స్థానిక దేవతాపరంగా వచ్చి ఉంటుందని కొంతమంది పండితులు భావిస్తున్నారు. మరి కొందరు 'కాకతి' అనే పట్టణం పేరు నుండి కాకతీయ పదం రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. కాని కాకతీయ రాజులు వేంగి దేశాన్నేలిన తూర్పు చాళుక్యుల సామంతులనే విషయంలో మాత్రం పండితులందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తూర్పు చాళుక్య రాజైన రెండవ అమ్మరాజు మరణం తర్వాత సామంత రాజైన మొదటి బేతరాజు క్రీ. శ. 1000 సంవత్సరంలో స్వతంత్రతను ప్రకటించి ఒక కొత్త రాజవంశాన్ని స్థాపించాడు. ఇతడు ముఫ్పై సంవత్సరాలు పాలించాడు. బేతరాజు తర్వాత ఆయన కుమారుడు మొదటి ప్రోలయ రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు.