పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9



నది నుండి దక్షిణాన తుంగభద్ర వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు గల భూభాగంపై శాతవాహనులు తమ ఆధిపత్యాన్ని చెలాయించడంతో దక్కను ప్రాంతానికి శాంతి సౌభాగ్యాల్ని చేకూర్చిపెట్టారు. ఇదే కాలంలో ఉత్తర భారతంలో విదేశీ దండయాత్రల వల్ల, అంతరంగిక కల్లోలాల వల్ల రాజకీయ అస్థిరత చోటు చేసుకోవడం గమనించ దగ్గది.

శాతవాహనుల పాలన అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఈనాటి ఆంధ్ర దేశమే కాక మహారాష్ట, గుజరాతు, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహారు రాష్ట్రాల్లోని ప్రాంతాలు సైతం శాతవాహన సామ్రాజ్య పరిధిలో ఉండేవి. వైశాల్యంలో మౌరసామ్రాజ్యం తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని అతి పెద్దదిగా పేర్కొనవచ్చు.

మతం

శాతవాహన రాజులు వైదిక మతాన్ని అవలంబించారు. వర్ణాశ్రమధర్మం ఆధారంగా ఏర్పడిన చాతుర్వర్ణ వ్యవస్థను పటిష్టం చేశారు. కాని వీరు మతోన్మాదులు మాత్రం కాదు. అశ్వమేధం, రాజసూయం వంటి క్రతువుల్ని నిర్వహించారు. బౌద్ధమతాన్ని ఆదరించడమే కాక చాలమంది శాతవాహన రాణులు బౌద్ధమత విశ్వాసాల్ని ఆచరించారు. వీరు అనేక బౌద్ధ విహారాల్ని, చైత్యగృహాల్ని నిర్మించడానికి సాయపడ్డారు. చైత్యగృహాలు బౌద్ధాలయాలుగాను, విహారాలు బౌద్ధ భిక్షవుల నివాస స్థలాలుగాను ఉపయోగపడేవి.

సమాజం

శాతవాహన రాజులు బ్రాహ్మణులు. వర్ణాశ్రమధర్మానుసారం ఏర్పడ్డ చాతుర్వర్ణ వ్యవస్థను పటిష్టం చేశారు. సాంఘీక వ్యవస్థను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజించడమే గాక, సాంఘీక హోదాననుసరించి కూడ మరో విభజన ఏర్పడింది. ఉన్నతోద్యోగులైన మహారధులు, మహాభోజులు, మహాసేనాపతులు మొదటి వర్గంగా వ్యవహరించబడ్డారు. అమాత్యులు, మహామాత్రులు, భాండాగారికులు, నైగములు, సార్ధవాహులు మొదలగు మధ్యతరగతి ఉద్యోగులు రెండవ వర్గంలో చేరారు. ఇక మూడవ వర్గంలో చిన్న ఉద్యోగులైన లేఖకులు, వృత్తికారులైన సువర్ణకారులు, ఘండికులు ఉన్నారు. తర్వాత లోహవణిజులు,