పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7



నహాపనుని నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఇవేకాక విదర్బ, ఆస్మాక, మూలక రాజ్యాల్ని కూడా తన అధీనంలోకి తెచ్చాడు. ఈ ప్రాంతాలు పశ్చిమ భారతంలోను, దక్కనులోను (ప్రస్తుత గుజరాత్, మహారాష్ట్ర) ఉన్నాయి. దక్షిణాన కృష్ణా నది నుండి ఉత్తరాన మాల్వ, కధియ వారు ప్రాంతాల వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన కొంకణ ప్రాంతం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. 'త్రి సముద్రతోయ పీతవాహన' (మూడు సముద్రాల నీరు త్రాగిన గుర్రాలు కలవాడు) అనే బిరుదును వహించాడు. దీన్ని బట్టి శాతకర్ణి బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూమహాసముద్ర పర్యంతం దండయాత్రను నిర్వహించినట్లు తెలుస్తున్నది.

సాహిత్యం

శాతవాహన రాజులు సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల్ని చక్కగా పోషించారు. శాతవాహన రాజైన హాలుడు, 'సప్తశతి' అనే గ్రంధాన్ని ప్రాకృతంలో రచించాడు. గుణాఢ్యుడు 'బృహత్కధ'ను పైశాచీమాండలికంలో వ్రాశాడు.

వర్తక వ్యాపారాలు

శాతవాహన రాజులు దేశంలోనే కాక విదేశాలలో సైతం వర్తక వ్యాపారాలు నడిపేవారు. శాతవాహనుల నాణాలపై కన్పించే ఓడబొమ్మ వారి సముద్ర వర్తకానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. కృష్ణానదీలోయ ప్రాంతంలో దొరకిన రోమను నాణేలు ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చాయి.

ఆర్ధిక రంగంలో 'శ్రేణులు' అభివృద్ధి చెందడం శాతవాహనుల పాలనలోని ఒక ముఖ్యలక్షణంగా భావించవచ్చు. ఈ శ్రేణులు ఈనాటి బ్యాంకుల వలె పనిచేసి వర్తకాభివృద్ధికి దోహదం చేశాయి.

నాగార్జునుడు

మాధ్యమిక వాద సిద్దాంతకర్తయైన ఆచార్య నాగార్జునుని ప్రసక్తి లేకుండా శాతవాహనుల చరిత్రకు పరిపూర్ణత చేకూరదని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో శ్రీపర్వతంగా వ్యవహరించబడ్డ ఈనాటి నాగార్జున కొండలో నాగార్జునుడు నివశించాడు. కొంతకాలం పాటు గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ ఆస్థానాన్ని కూడ అలంకరించాడు. నాగార్జునుడు తత్త్వశాస్త్రవేత్తగానే కాక రసాయన శాస్త్రవేత్తగా