పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
6

హాలుడు (క్రీ. పూ. 19 - 24)

హాలుడు శాతవాహన రాజుల్లో 17 వ వాడు. వాత్స్యాయనుని కామసూత్రంలోను, రాజశేఖరుని కావ్యమీమాంసలోను హాలుని గూర్చిన ప్రశంస ఉంది. హాలుడు సాహిత్యాన్ని, కళల్ని ఆదరించి పోషించాడు. స్వయంగా ప్రాకృతభాషలో 'సప్తశతి' అనే గ్రంథాన్ని హాలుడు రచించాడు. బృహత్కధ రచయితయైన గుణాడ్యుడు హాలునికి సమకాలికుడు. చాలమంది కవులకు, పండితులకు ఆశ్రయం కల్పించడం వల్ల హాలునికి 'కవివత్సలుడు' అనే బిరుదు వచ్చింది. హాలుడు సప్తగోదావరి - భీమనదుల ఒడ్డున శ్రీలంక రాజకుమార్తెను పెళ్ళాడాడు. హాలుని తర్వాత శాతవాహనుల చరిత్ర మరల మరుగున పడింది. శాతవాహనులు మధ్య, పశ్చిమ భారతాల్లో తమ అధికారాన్ని కోల్పోయారు. వీరి పాలన ఆంధ్రదేశంలో మొదట తమ అధీనంలో ఉండిన ప్రాంతాలవరకే పరిమితమయింది.

మలి శాతవాహనులు

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ. శ. 78 - 102)

ప్రాచీన భారతదేశపాలకుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి పేరెన్నికగన్నవాడు. ఇతడు శివస్వాతి, గౌతమీ బాలశ్రీలకు గల్గిన పుత్రరత్నము. శాతకర్ణి వ్యక్తిత్వాన్ని గురించి, అతని ఘనవిజయాల్ని గురించి బాలశ్రీ నాసిక్ శాసనం చక్కగా తెలియచేస్తుంది.

గౌతమీ పుత్రశాతకర్ణి రాజ్యాధికారానికి వచ్చేనాటికి దేశపరిస్థులు నిరాశాజనకంగా ఉండేవి. భారత గంగా మైదానంలోకి కుషాణులు చొచ్చుకు రావడం మొదలయింది. పశ్చమ దక్కను ప్రాంతం క్షాహరాటుల చేతుల్లోకి పోయింది. హిందూమతాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడ్డ విదేశీ తెగలైన శాక్యులు, యవనులు, పహ్లవులు దక్కను ప్రాంతంలో శాంతిభద్రలకు భంగం కలిగించారు. ఈ పరిస్థితుల్లో శాతకర్ణి ధైర్యాన్ని కోల్పోక పరిస్థితులకు అనుగుణంగా స్పదించి శాక్యుల్ని, యవనుల్ని, పహ్లవుల్ని ఓడించాడు. నహాపనుని క్షాత్రపవంశాన్ని సమూలంగా నాశనం చేశాడు. శాతవాహన వంశ ప్రతిష్ఠను తిరిగి నెలకొల్పాడు. శాతకర్ణి అనుప, అపరంత, సౌరాష్ట్ర, కుకుర, అవంతి రాజ్యాల్ని