పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5


శాతకర్ణి (క్రీ. పూ. 180 - 170)

శాతకర్ణి భార్య నాగానిక. ఈమెనే నాయనిక అని కూడా అంటారు. ఈమె వేయించిన నానేఘాట్ శాసనం వల్ల శాతకర్ణి పాలనను గురించిన చాల విషయాలు మనకు తెలుస్తున్నాయి. నాగానిక మహారధి 'త్రాణకైరో' కుమార్తె. ఈమె రాచకార్యాల్లో కూడా తన ప్రభావాన్ని చూపగల్గింది. మగధ నేలిన పుష్యమిత్రసుంగునికి, కళింగనేలిన కారవేలునికి శాతకర్ణి సమకాలీనుడు. పశ్చిమ మాల్వా, అనుప లేక నర్మదా నది లోయ ప్రాంతాన్ని, విదర్బను శాతకర్ణి ఆక్రమించినట్లు నానేఘాట్ శాసనం తెలియజేస్తుంది. ఈ ప్రాంతాల్ని జయించినందుకు విజయ చిహ్నంగా శాతకర్ణి అశ్వమేధ యాగాన్ని, ఒక రాజసూయాగాన్ని కూడా నిర్వహించినట్లు పై శాసనం తెలుపుతోంది. శాతకర్ణి తనను తాను 'సామ్రాట్టు'గా ప్రకటించుకొని 'దక్షణాపతి', 'అప్రతిహతఃచక్ర' వంటి బిరుదుల్ని దరించాడు. శాతకర్ణి తర్వాత పిన్న వయస్కుడైన ఆయన కుమారుడు వేదశ్రీ రాజ్యానికి వచ్చాడు. నాగనిక తన కుమారుని పేరుతో ప్రభుత్వ వ్యవహారాల్ని సమర్థవంతంగా నిర్వహించింది. వేదశ్రీ యుక్తవయస్సుకు రాకముందే మరణించాడు. తర్వాత వేదశ్రీ తమ్ముడు సతిశ్రీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. వీరిని గురించిగాని, వీరి తర్వాతి రాజులను గురించి తెలిపే ఆధారాలు ఏవీ లేవు. తర్వాత వచ్చిన ముఖ్యమైన రాజుల్లో రెండవ శాతకర్ణి ఒకడు. ఇతడు క్రీ. పూ. 152 నుండి 96 సంవత్సరం వరకు పాలించాడు.

రెండవ శాతకర్ణి (క్రీ. పూ. 152 - 96)

రెండవ శాతకర్ణి సాగించిన సుధీర్ఘమైన పరిపాలన శాతవాహనుల చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా పేర్కొనవచ్చు. ఇతని కాలంలోనే మగధ రాజధానియైన పాటలీపుత్రం మొదటిసారిగా శాతవాహనుల ఆధీనంలోకివచ్చింది. విదుష, కళింగ రాజ్యాల్ని కూడా ఆక్రమించి శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. కాని తన చివరి రోజుల్లో శాక్యులు పశ్చిమ దక్కను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాతకర్ణి తర్వాతి రాజుల గురించి మనకంతగా తెలియదు. తర్వాత వచ్చిన రాజుల్లో హాలుడు ముఖ్యుడు. ఇతడు క్రీ. శ. 19 నుండి 24 వ సంవత్సరం వరకు రాజ్యపాలన చేశాడు.