పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4



పురాణాల్లోని ఆధారాల్ని వారు ఎత్తిచూపారు. పురాణాలు శాతవహనుల్ని గూర్చి ప్రస్తావించేటప్పుడు 'ఆంధ్ర దేశీయ', 'ఆంధ్ర జాతీయ' అని వ్యవహరించాయి. అశోకుని శాసనాలు కూడా శాతవాహనుల్ని 'ఆంధ్రభృత్యులు'గా వర్ణించాయి.

శాతవాహనుల పాలన

శాతవాహనుల పాలన ప్రారంభాన్ని గురించి, వారి పరిపాలనా కాలాన్ని గురించి వివిధాభిప్రాయాలు ఉన్నాయి. శాతవాహనుల కాలం క్రీ పూ 6 లేక 5 వ శతాబ్దిలో ప్రారంభం అయివుంటుందని ఆర్ బండార్కర్ అను పండితుడు అభిప్రాయపడ్డాడు. కాని ఈ అభిప్రాయాన్ని చాలామంది పండితులు అంగీకరించలేదు. శాతవాహనుల పాలన క్రీ పూ 221 నుండి క్రీ శ. 218 సంవత్సరాల మధ్య కాలంలో విలసిల్లినట్లు డా ఎం రామారావు అభిప్రాయపడ్డారు.

శ్రీముఖుడు (క్రీ. పూ. 221 - 198)

అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. ఉత్తర భారతంలోని అస్థిరతను ఆసరాగాతీసుకుని శాతవాహనులు తమ స్వతంత్రతను ప్రకటించారు. శాతవాహన రాజుల్లో మొదటి వాడు శ్రీముఖుడు. ఇతని కాలంలో శాతవాహన రాజ్యం పశ్చిమాన దక్కను ప్రాంతం వరకు వ్యాపించింది. శ్రీముఖుడు దాదాపు 23 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. శ్రీముఖుని తర్వాత అతని తమ్ముడు కృష్ణ క్రీ పూ 198 లో రాజ్యాధికారం చేపట్టాడు.

కృష్ణ(క్రీ. పూ. 198 - 180)

కృష్ణ తన సోదరుని అడుగుజాడల్లో రాజ్యాన్ని పాలించి పశ్చిమాన నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతని పాలన గురించిన విశేషాలు మనకంతగా లభించలేదు. నానేఘాట్ చెక్కడాల్లోని చిత్రాల్లో సైతం కృష్ణ చిత్రం కన్పించదు. కృష్ణ తర్వాత రాజ్యానికి వచ్చిన మొదటి శాతకర్ణి భార్య నాగానిక నానేఘాట్‌లో చిత్రాల్ని చెక్కించింది. తన సంతానం, తండ్రి, భర్త, శాతకర్ణి తండ్రి చిత్రాల్ని చెక్కించిన ఈమె కృష్ణ చిత్రాన్ని చెక్కింపకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. దీనివల్ల కృష్ణ సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కుంచుకుని ఉంటాడని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు.