పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వింధ్యపర్వతమువద్దకు వచ్చి నివసించిరని ప్రత్యేకవిషయముగా చెప్పుటలో విశేషమేమియు గనబడదు. ఆవాక్యమువలన వారివాదమున కెట్టి బలమును కలుగబోదు. అంధ్రాది బాహ్యజాతులు ఉత్తరదేశ వాసులు మాత్రమే యని యెంచుట పొరబాటు. ఆర్యు లెచ్చట కాపురముండిన వారిప్రక్కనే యీ అంధ్రాది బాహ్యజాతులవారును నివసించుచుండిరి. ఆర్యులు భరతవర్ష మందంతటను వ్యాపించి నివసించి యుండుటవలన అంధ్రాది జాతులవారును ఆర్యులతో పాటు పోయి వారిప్రక్కనే నివసించుచువచ్చిరి. కనుక ఆవాక్యమువలన వారివాదమున కెట్టి బలమును చేకూరకపోగా దానిని వ్యతిరేకించుచున్నది.

సందర్భశూన్యముగా వింధ్యపర్వతములకు దక్షిణముగా ఆర్యులతో కలిసి యిరుగుపొరుగుగా అనాగరికులగు అనార్యజాతులు నివసించుచున్నవని చెప్పి ప్రత్యేకముగా "అంధ్ర"జాతి యిచ్చట నివసించినట్లు సూచించుచున్నారు. ఇది వారియూహయే గాని సత్యము కాదు. దానికి పూర్వచరిత్రాధారము లేవియు గానరావు. అందులకు విరుద్ధముగా "అంధ్ర"లనెడి బాహ్యజాతి అరణ్యములలో ఆరణ్య పశువులను చంపి వాని మాంసమును తినుచు జీవించుచుండిరని మనువు వ్రాసి యున్నాడు:-

               శ్లో|| 'మేదాంధ్ర చుంచు మద్గూనా మారణ్య పశు హింసనం.'
                                                                        (మను 10-48)

అనగా మేద, అంధ్ర, చుంచు, మద్గు అనెడి బాహ్యజాతివారలు అరణ్య ప్రాంతములలో నుండి అచ్చటి పశువులను హింసించి వానితో జీవించువారుగా నుండిరని మనువు చెప్పుచున్నాడు. ఆర్యుల కిరుగుపొరుగున బాహ్యజాతులు నివసించుచుండుట సహజముగానే యున్నందున వింధ్యపర్వతమువద్ద కూడ అట్లే జరిగియున్న దనుటలో ప్రత్యేకత ఏమియు కానరాదు. ఇందువలన కూడ వారివాదమున కెట్టి బలమును చేకూరదు. ఈవాక్యములను హేతువాదములుగా నెంచుట హాస్యాస్పదము. అంధ్రాది బాహ్యజాతులు ఆర్యులలోని నాలుగువర్ణములవారికి