పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్లు జరిగియుండినట్లు సంస్కృతవాఙ్మయమం దెచ్చటను ఒక్కవాక్యమైనను కానరాదు. ఆనాటికి ఐరోపాఖండము నిర్మానుషముగా నుండి అచ్చటచ్చట పశుప్రాయులైన అనాగరికమానవులతో నిండియున్నది. వీరు తమ ఊహాగానమును విడిచి భారతీయుల ప్రాచీనచరిత్రలనుండి (శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాదులనుండి) యొక్క వాక్యమును చూపి వారి వాదమును సమర్థించుకొన గోరుచున్నాము.

శపింపబడిన విశ్వామిత్రుని జ్యేష్ఠకుమారు లేబదిమందియును (వారి పుత్రపౌత్రాదులతో సహా) బాహ్యజాతులలో చేరిపోయి రని మాత్రమే ఐతరేయ బ్రాహ్మణములో చెప్పబడిన చరిత్ర. ఆబాహ్యజాతివారే ఆంధ్రదేశ మాక్రమించి రనునది వీరి యూహాగానము. వారు తమ ఊహాగానమును సమర్థించుకొనుటకు చేయుచుండిన వింతవాదమును పరికింపుడు:-

"ఆర్యజాతివారలతో కలిసి వింధ్యపర్వత ప్రాంతముల యందలి అనాగరిక జాతులవారలు కూడ ఆర్యుల కిరుగుపొరుగు వారలుగా నివసించుచుండిరి. దీనినిబట్టి విశ్వామిత్రునిచే శపింపబడి అంధ్రాది జాతులలో కలిసిపోయిన 'అంధ్రులు' ఉత్తర హిందూస్థాన వాసులు". అని వ్రాసియున్నారు.

విశ్వామిత్రుని ఆశ్రమము ఉత్త్రరహిందూస్థానమున హిమాలయ పర్వత సమీపమున సరస్వతీనదీ తీరమున గలదు. శపింపబడిన విశ్వామిత్రుని కుమారులు అచ్చట గల అంధ్రాది బాహ్యజాతులలో మిశ్రమ మైపోయిరి. అది ఉత్తర హిందూస్థానములోని దని అందరకును తెలిసిన విషయమే. వింధ్యపర్వత శ్రేణి విశ్వామిత్రుని ఆశ్రమమునకు దక్షిణముగా కొన్ని వందల మైళ్ల దూరమున గలదు. నేటికికూడ అనాగరిక జాతులైన కోయ, చెంచు, భిల్ల, ఎఱుకల, యానాది, కోందు, సవర, పొరజ, గదబ, కొండదొర, గొండియ భోత్రమొదలుగాగల అనేకశాఖలవారు ఆర్యులప్రక్కనే నివసించుచునే యుండిరి.