ఒకవర్ణమువారితో మఱియొక వర్ణమువారికి గలిగిన సంపర్కమువలన ఏర్పడిన విలోమజాతు లైనందున వారు కొన్ని నియమములకు లోనై ఆర్యసంఘములో భాగస్థులుగా నుండిరేకాని వార లెప్పుడును ప్రత్యేకమైన ఆ ర్యేతర జాతులుగా ఎంచబడలేదు. వారు ఆర్యులలో చేరిన విలోమశాఖవా రైయున్నారు. వారు స్వతంత్రజీవనము గలవారుగానే యుండిరి. కాని వారి కెట్టి బానిసతనమును లేదు.
'అంధకులే అంధ్రులు'అనెడి వాద నిరాసము
"బౌద్ధవాఙ్మయములో 'అంధకు'ల నెడి యొక తెగవారి ప్రశంస గలదు. 'అంధకు' లనగా 'అంధ్ర' యనెడి బాహ్యజాతి. వా రుత్తరదేశపు వారు. ఆగ్రంధములో 'అంధకవన'మను ఒక అరణ్యప్రదేశము గలదని చెప్పబడినది. అది ఉత్తర కోసల రాజ్యమునకు ముఖ్యపట్టణ మైన 'శ్రావప్తి'సమీపమున గల 'జేతవనము'వద్ద గలదు. దీనినిబట్టి 'అంధ్రులు' మొదట ఉత్తర హిందూస్థాన వాసు లైయుండి అతి ప్రాచీనకాలమున దక్షిణమునకు కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రదేశమునకువచ్చి దాని నాక్రమించి స్థిరపడిరి". అని వ్రాయుచున్నారు.
(ది 1-10-53 హిందూపత్రిక ఆంధ్రులను గురించిన వ్యాసము)
"అంధ్రకు" లనగా 'అంధ్ర' లని యెంచుట పొరబాటు. చంద్రవంశపు క్షత్రియులలో 'అంధకు'ల నెడి యొక క్షత్రియశాఖ గలదు. యయాతి కుమారుడు యదువు. ఇతని కుమారుడు క్రోష్టువు. క్రోష్టువువంశములో క్రోష్టువునుండి లెక్కించగా ముప్పదిఎనిమిదవ ప్రముఖవంశమువాడు సాత్వతుడు. సాత్వతుని కుమారులు ఏడుగురిలో ఆఱవవాడు 'అంధకుడు'. అందు జ్యేష్టుడగు భజమానునివంశములో ఐదవతరమువాడు 'శిని'. ఈతనికి సత్యకుడు గలిగె. సత్యకునికి కాశీరాజుకూతునందు 'కుకుర, ద్వితీయభజమాను'లు కలిగిరి. కుకురునికి వృష్టి, అతనికి కపోతరోముడు అతనికి 'విలోముడు' ఆ విలోమునకు 'ద్వితీయఅంధకుడు' గలిగిరి. ఈ ద్వితీయాంధకునకు 'బిందనోదక దుందుభి' అను నామాంతరము గలదు.