పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందు సంచరించెడి బాహ్యజాతులలో కలిసిపోయి రనియు వారు, వారికి జన్మించెడి సంతాన పరంపర (పుత్రపౌత్రాదు లందరును) దారులుకొట్టి జీవించెడివారుగా-అనాగరికులుగా-శాశ్వతముగా నుండిరనియు, వారు తిరిగి పూర్వస్థితిని పొందుట కెట్టి యవకాశమును లేదనియు చెప్పుటయే ఈ చరిత్రలోని సారాంశము. అంతేకాక వారు ఈ ఐదింటితో తుల్యములైన ఇతర జాతులతో కూడ కలిసి పోయిరని చెప్పబడినది. శాపము నుండి విముక్తులగుట కెట్టి యనుగ్రహ వాక్యమును ప్రసాదింపబడ నందున దానికి పరిహార మెప్పటికిని గలుగదు.

పైవాక్యములో వినబడిన "అంధ్ర" శబ్దమును తీసికొని ఇచ్చట గల ఆంధ్రదేశమునకు ముడిపెట్టి ఆంధ్రజాతి అనాగరిక-బాహ్యజాతి యని చెప్పుటకు పాశ్చాత్య చరిత్రకారు లనేకములగు ఊహలు చేసి తమ కల్పితవాక్యములతో చరిత్ర నల్లి కృష్ణాగోదావరీ నదీ ప్రాంతముల వ్యాపించియుండిన "ఆంధ్ర" దేశమున ఇప్పుడు నివసించుచుండిన వైదిక ధర్మావలంబులైన చాతుర్వర్ణ్యస్థులైన ఆంధ్రమహాజనులందరును సంకర జాతీయులని కథ లల్లియుండిరి. వారియొద్ద చదువుకొనిన హైందవ సోదరులుకూడ ఎట్టి విమర్శనమును లేక వారి మాటలనే చిలుకపలుకుల వలె పలుకుచుండిరి. కాని ఆంధ్రదేశములో ఇప్పుడుండినవారు వైదిక ధర్మావలంబులైన చాతుర్వర్ణ్యస్థులు గాని బాహ్యజాతివారు కారని వారు గ్రహించలేనందులకు విచారించవలసి యున్నది. బాహ్యజాతీయు లెప్పుడును వైదికార్యులలో చేరుట కెట్టి యవకాశమును నేటికిని లేదని వీరికి తెలియని విషయము కాదు.

ప్రవ రాంతరము

విశ్వామిత్రుని కనిష్ఠపుత్రులైన యేబదిమందితో గూడిన మధ్యమపుత్రుడైన మధుచ్ఛందుడు శునశ్శేఫుని జూచి ఈవిధముగా నుడివెను. ఓ శునశ్శేఫుడా! మనకు తండ్రియైన విశ్వామిత్రు డేకార్యమును-అనగా నీ జ్యేష్ఠత్వము నంగీకరింపు డని-మాకాజ్ఞాపించెనో దానికి మే మంగీకరించితిమి. నీవు మాకు జ్యేష్ఠుడవు-నీ పేరున శునశ్శేఫు