పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథములను చదివి ఆనందించగల భాగ్యము నాకు లభించినది. శ్రీ వెంకటాచలంగారు పర్గీటరు వ్రాసిన "The dynasties of the Kali Age" అను గ్రంథములో తెలియక చేసిన పొరబాట్లననేకములను సవరించి పర్గీటరు తానాధారపడిన ఆపురాణములనుండియే సరియైనభాగముల మద్ధరించి చక్కగా వ్యాఖ్యానించి పర్గీటరుచేసినప్రమాద భూయిష్టములైన నిర్ణయములను సవరించి సత్యమును ప్రకటింపగలిగిరి. కలిశక విజ్ఞానమును సమస్తాంధ్రులను పఠించి తీరవలయునని నా అభిప్రాయము. అట్లే మనము నివసించు జంబూద్వీప విభాగనిర్ణయములో శ్రీవారు చేసిన నిర్ణయము సర్వధా శ్లాఘ్యముగా నున్నది. 'ఆంధ్రులెవరు?' అనువ్యాసము యింతకు పూర్వము చరిత్రకారులందరును త్రొక్కిన త్రోవను ద్రొక్కక క్రొత్తదృక్పథమును వెల్లడించుచున్నది. ఆంధ్రుల నిజస్వరూప మిట్టిదని శ్రీవెంకటాచలంగారీ గ్రంథమున నిరూపించిరి. 'ధ్రువనివాస ఖండన' మను గ్రంథము శ్రీతిలక్ గారు రచించిన " The Aretic Home" అను ఇంగ్లీషు గ్రంథములోని విషయమునకు సప్రమాణమైన విమర్శనమైయున్నది. శ్రీతిలక్‌గారి గ్రంథములోని పాండిత్య విలంబమునకు వేదవిజ్ఞానపు లోతు తెలియని హూణపండితులు ముగ్ధులై జేజేలు పెట్టుచుండ అది కాదని అనేక ప్రమాణములతో నిరూపింప సాహసించి నిలిచిన ధీరు లింతవరకును శ్రీ వెంకటాచలంగా రొక్కరే. "భారతీయశకము" లనెడి వీరిగ్రంథము చరిత్ర నిర్మాణమున కత్యంతోపయుక్తమైనది. వివిధ శకకాలములలో యిదివరకుండిన పొరబాట్లను చూపుచు సరియన కాలనిర్ణయములు సప్రమాణముగా యిందు నిరూపింపబడినవి. లోకములో ప్రబలముగ వ్యాపించిన అసత్య సిద్ధాంతముల నరికట్టి సత్యచరిత్ర నిరూపణమునకు కంకణము కట్టిన శ్రీవెంకటాచలంగారి పాండిత్య గౌరవ మసాధారణమైనదని చెప్పుట కెట్టి సందేహమును లేదు. ఈధోరణిలో శ్రీవారు వ్రాసిన గ్రంథము లెన్నియో గలవు. అవన్నియు నచిరకాలములో బ్రకటితములై ఆంధ్రులలో చరిత్రవిజ్ఞానవ్యాప్తికి తోడ్పడగలవని విశ్వసించుచున్నాను.

ఇట్లు,
చిలుకూరి నారాయణరావు వ్రాలు
మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ,
M.A., P.H.D., L.T.
అనంతపురము.
14 - 10 - 1950.