పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

లోగడ ఈ గ్రంథకర్తచే వ్రాయబడి ప్రకటింపబడిన "ఆంధ్రు లెవరు?" అనెడి చిన్నగ్రంథము దేశమందు వ్యాప్తి చెందినది.దానిని చదివినవారలు "ఆంధ్రుల" సత్య చరిత్రను తెలిసికొని ఆనందించి యుండిరి. ఆంధ్రదేశములోని పలుతావులనుండి ఆగ్రంథము కావలయునని జాబులు వచ్చుచున్నవి. కాని గ్రంథములలో చాలభాగము ఉచితముగానే వ్యయపఱపబడినందున గ్రంథములన్నియు అయిపోయినవి. తిరిగి దానిని రెండవసారి ముద్రించ ప్రయత్నించుచున్నంతలో కొందరు మిత్రులు లోగడ గ్రంథము ఇతరులచే ఆంధ్రులనుగుఱించి వ్రాయబడిన అప్రామాణిక విషయముల నెత్తుకొనుటతో ప్రారంభమై వానిని ఖండించుట కేర్పడిన ఖండన గ్రంథముగా నున్నదనియు, అట్టి పద్ధతిని మార్చి ఆంధ్రులయుత్పత్తి మొదలుకొని వ్రాసి అందు ఇతరుల దురభిప్రాయములకు జవాబు వ్రాసిన బాగుండుననియు నభిప్రాయపడి యుండుటచే సృష్ట్యాదినుండి ప్రారంభించి "ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు" అను పేరున ఈగ్రంథము వ్రాయబడినది. సృష్ట్యాదియందు 'ఆర్యులు' అనెడి సంజ్ఞతో దేవ, మానవాది వర్గములు బహిర్గతమైనవి. అందు దేవతాది వర్గములు వారివారి కేర్పడిన ఊర్ధ్వాదిలోకములందు నివసించిరి. మానవవర్గము భూలోకమున నివసింపజేయబడి ఆర్యులను నామముననే వ్యవహరింపబడినది. వీరిని స్వాయంభువమనువు ఉత్పత్తిని బొందించి, పోషించి, పాలించి, భరించినందున అతనికి 'భరతుడు' అను పేరు కలిగినది. "భరణాచ్చ ప్రజానాం వై" మనుర్భరత ఉచ్యతే." (ప్రజలను భరించినందున మనువు భరతుడని చెప్పబడుచున్నాడు.) అని మత్స్య, వాయు పురాణములు చెప్పుచున్నవి. 'భరతు'డని ప్రసిద్ధ నామమును వహించిన మనువుచే సృష్ట్యాదికాలమున పరిపాలింపబడుటచేతను, ఆ భరతుడే భూలోకములో ప్రథమరాజగుటచేతను రాజనామమున మనదేశమునకు 'భారతవర్షము' అనియు - అందు వసించెడి ఆర్యులకు 'భారతుల'నియు - పేరులు కలిగినవి. పిమ్మట 'నాభి' యనెడి రాజు వలన 'అజనాభ' మనియు అటుపిమ్మట మరల ఋషభుని కుమారుడగు 'భరతుని' వలన భారతవర్షమనియు పేరొందినది. అట్టి యీ మన భారత