పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండువిధముల ప్రయోగములు ఆయనకు గలవు. మయూరశర్మ బ్రాహ్మణవంశమైన కదంబ వంశమునకు మూలపురుషుడు.)

నంబూద్రి బ్రాహ్మణుల కథలు, వ్రాతలన్నియు మయూరశర్మ వఱకును తీసికొని పోగలవు. మయూరవర్మచే బ్రాహ్మణులు కొనిరాబడినపుడు వారు భట్టాచార్యులవారి (కుమారిభట్టు) శిష్యులుగా నుండిరి. కాని పడమటి తీరమునకు వీరు వచ్చినపిమ్మట మళయాళ దేశపు వేదాంతగురువగు శంకరాచార్యులవారి (వీరి జననము క్రీ. పూ. 509 సం) సిద్ధాంతముల నంగీకరించిరి.

పైగ్రంధముననే ఐదవ సంపుటములో శ్రీ సుబ్రహ్మణ్య అయ్యరు గారిట్లు వ్రాయుచున్నారు:-

"కేరళ మాహాత్మ్యములో వ్రాయబడిన దంతకథా పరంపర (కేరళదేశములో) నంబూద్రీ బ్రాహ్మణులు అహిక్షేత్రమునుండి వచ్చినట్లుగా చెప్పును."

ఈ పైవాక్యములు కేరళ మాహాత్మ్యము, కేరళోత్పత్తి యను సంస్కృత గ్రంథములనుండి గ్రహింపబడినవి.

మయూరవర్మయును, భట్టాచార్యులవారును, శ్రీ శంకరాచార్యులవారును 'ఆంధ్రుల'ని ఆంధ్రమహాసభవారిచే ప్రచురింపబడిన 'ఆంధ్రప్రచలనము' అను చిన్న గ్రంథమున ప్రథమ ఆంధ్రసభానంతరము ప్రచురింపబడెను. మఱికొన్ని దంతకథలును పైవిధముననే చెప్పుచున్నవి. అని వ్రాసియుండెను.

"కనరా రాష్ట్రమును, మైసూరురాష్ట్రములోని ఉత్తరజిల్లాలను క్రీ. శ. మూడవ శతాబ్దమునుండి ఆఱవ శతాబ్దమువఱకు పరిపాలించిన కదంబవంశపు రాజులు బ్రాహ్మణులు." (వి. ఎ. స్మిత్ యొక్క అర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథము 43 పుట చూడుడు). కేరళదేశమును క్రీ. పూ. ఆఱవశతాబ్దమునుండి క్రీ. శ. ఆఱవ శతాబ్దమువఱకు పరిపాలించిన కదంబవంశపు రాజులును వారిచే తీసికొని పోబడిన బ్రాహ్మణులును ఆంధ్రులైయుండిరి.