పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్లు గోదావరీమండలములోని సర్పవర గ్రామము (అహిక్షేత్రము) నుండి కేరళదేశపు బ్రాహ్మణరాజగు మయూరశర్మ చే ప్రేరేపింపబడి వలసపోయిన ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబములలో శివగురు వనెడి పండితుడు గలడు. ఆతడు కేరళదేశములోని "కాలటి" అగ్రహారమున స్థిరపడిన పిమ్మట ఆతనికి శ్రీ శంకర భగవత్పాదాచార్యులవా రవతరించిరి. కనుక శ్రీ శంకరులును, కేరళదేశములోని నంబూద్రి బ్రాహ్మణులును 'ఆంధ్రులై' యుండిరి. విశిష్టాద్వైత మత స్థాపనాచార్యులైన శ్రీ రామానుజాచార్యుల వారింటిపేరు 'ఆసూరివారు'. ఇంటిపేర్లు తెలుగు వారికి మాత్రమే కలవు. తమిళులకు ఇండ్లపేర్లు లేవు. శ్రీరామానుజాచార్య స్వాములు తెలుగుదేశమునుండి పోయి అరవదేశములో స్థిరపడిన ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబమునకు చెందినవారై యున్నారు. అటులనే ద్వైత మత స్థాపకులగు శ్రీమధ్వాచార్యస్వాములవారి యింటిపేరు 'నడిమింటి' వారు. వీరును కర్ణాటదేశమున నివసించిన ఆంధ్రబ్రాహ్మణ కుటుంబమునకు చెందినవా రైయుండిరి. గొప్ప మతకర్తలై పీఠాధిపతులైన శ్రీ శంకర, శ్రీరామానుజ, శ్రీమధ్వాచార్యులను ఆచార్య త్రయమును ఆంధ్రులై యున్నారు. క్రీ. శ. 15 వ శతాబ్దములోని శ్రీతాళ్లపాక అన్నమాచార్యులును ఈయనకుమారుడు శ్రీతిరువెంగళయ్య గారును, క్షేత్రయ్యపదములను రచించిన క్షేత్రయ్యగారును (7 వ శతాబ్దము) భక్తిజ్ఞానవైరాగ్యములను సంగీతమున మేళవించి అసంఖ్యాక కృతులను రచించిన త్యాగరాజుగారును (18 వ శతాబ్దము) ఆంధ్రమాత కనిన బిడ్డలై యున్నారు. జైన, బౌద్ధమతముల వ్యాప్తి నరికట్టి వైదికమత సంరక్షణమొనర్చిన "కుమారిభట్టు" (557 B.C) ఆంధ్రుడై యున్నాడు. నాలుగు వేదములకు భాష్యములను రచించి ప్రపంచమున కీనాడు వేదార్థమును దెలిపిన మహామహుడు శ్రీ విద్యారణ్యస్వామి ఆంధ్రుడు.

                   "ఆంధ్రత్వ మాంధ్రభాషా చ, ప్రాభాకర పరిశ్రమ:|
                    తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపన: ఫలం||"
                                                                   (అప్పయ్యదీక్షితులు)