పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

15

ఆంధ్ర సారస్వత విషయంలోను, నాట్య సంగీతముల విషయంలోను ఇవి చేస్తున్న కృషి అపారమైనవి. ఇంతేగాక మహిళల ఉద్యమము, హరిజనోద్ధరణకు సంబంధించిన ఉద్యమము మొదలైన ఉద్యమాలు దేశంలోని సాంస్కృతిక ప్రగతికి చాలా తోడ్పడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మహిళలకు సంబంధించిన దానిగా ప్రకటించబడింది. ఈ మధ్యనే బెజవాడలో మహిళా సభలు విజయవంతంగా జరుపబడ్తాయి. ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ జలగం వెంగళరావుగారి ఆధ్వర్యవంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇదంతా ఆధునికయుగంలో ఆంధ్రులు సాధించిన ప్రగతికి నిదర్శనం.

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

మతం:

ఆంధ్ర దేశంలోనే కాదు, భారతదేశం అంతటా రాజకీయ సాంఘికాది విషయాలన్నీ మతంతో ముడి పెట్టబడి ఉండేవి. అసలు మానవ చరిత్రలోనే మతానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. మత ప్రాతిపదిక మీదనే ఆంధ్రదేశంలో లలితకళలు, సాహిత్యం ఆవిర్భవించాయనడంలో అతిశయోక్తి లేశమాత్రం కూడా లేదు. ఆంధ్ర శాతవాహనులు వైదిక మతావలంబులు. కాని, బౌద్ధాన్నికూడా ఆదరించారు. ప్రజానీకంలో బౌద్ధ మతానికే ప్రాధాన్యం ఉండేది. అసలు శాతవాహనుల కాలంలో భారతదేశం అంతటిలోనూ ఆంధ్రదేశమే బౌద్ధానికి ప్రధాన కేంద్రం అని నిశ్చితంగా చెప్పవచ్చు. మహాయాన ప్రవక్త ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నాడనడానికి నిదర్శనాలున్నాయి. నేటి నాగార్జున కొండను ఆనాడు శ్రీపర్వతం అనేవారు. ఆచార్య నాగార్జునుడు ధనకటక మహాచైత్యానికి ప్రాకారాన్ని కట్టించేడు. శ్రీ పర్వతంమీద మంటపాలయాల్ని వెలయించాడు. ఇక్ష్వాకులు బౌద్ధులు కారు. కాని, వీరికాలంలో బౌద్ధం బాగా వ్యాప్తిలోనికి వచ్చింది. నాగార్జున కొండలోని కట్టడాలు వీరి కాలంలోనే నిర్మింపబడ్డాయి. దీని కారణం కొంత విచిత్ర్ంగా ఉంది. రాజులు మహాసేన పాదానుధ్యాతులైనా, క్రతువులు చేసినా, రాణులు మాత్రం బౌద్ధమతాన్నే అభిమానించేవారు. విష్ణుకుండినులు, పూర్వ చాళుక్యులు వైదిక మతాన్నే ఆదరించారు. వీరు పరమ మహేశ్వరులుగా కీర్తింపబడ్డారు. చాళుక్య రాజుల్లో రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలను కట్టించాడట. కాకతీయులు మొదట జైనులు; తరువాత శైవులయారు. పూర్వ చాళుక్యులలో కూడా జైన మతాన్ని అవలంబించిన రాజులున్నారు. రాజరాజు తండ్రి విమలాదిత్యుడు జైనాన్ని అవలంబించినట్లు కనబడుతుంది. గోళకీ మతాచార్యుడు విశ్వేశ్వరుడు కాకతీయ గణపతి దేవుడుకి "చిన్మయ దీక్ష" నిచ్చాడట. విజయనగర రాజులలో సంగమ వంశమువారు శైవులే. సాళువ, తుళువ, ఆర్వీటి