పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
14

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

భోగరాజు పట్టాభిసీతారామయ్య పంతులుగారు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మొదలయినవారు చేపట్టి నిర్వహింపసాగిరి. ఆ కాలంలోనేతెలంగాణాలో శ్రీ కొమర్రాజు లక్షణరావు పంతులుగారు చారిత్రక పరిశోధనలు ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో ఆంధ్రచరిత్ర పరిశోధక సంస్థ (Andhra Historical Research Society) ఒకటి స్థాపింపబడింది. దీనిలో శ్రీ రాళ్లబండ సుబ్బారావుగారు, శ్రీ బావరాజు వేంకట కృష్ణారావు గారు మొదలయిన ఉద్ధండ పండితులు పరిశోధన సాగించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు, సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తు మొదలైనవి ఆ కాలంలోనే సాహిత్యాభివృద్ధికి చాలా కృషి చేశాయి.

క్రీ.శ. 1926 లో మొట్టమొదట బెజవాడలో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు స్థాపింపబడింది. తరువాత క్రీ.శ. 1931లో వాల్తేరుకు మార్చబడ్డది. దీనికి ఉపాధ్యాక్షులుగా డా.కట్టమంచి రామలింగారెడ్డి గారు, డా. సర్వేపల్లి రాథాకృష్ణన్ గారు, డా. వాసిరెడ్డి శ్రీకృష్ణాగారు మొదలైన మహావిద్వాంసులు పనిచేసి ఈ సంస్థమొక్క సర్వతోముఖాభి వృద్ధికి పాటుపడ్డారు.

ఆధునికయుగంలో ముఖ్యంగా చెప్పవలసినది నాటకకళాభివృద్ధి. పూర్వం మనకి యక్షగానాలు, వీధి నాటకాలు తప్ప మార్గ నాటకాలకి సరియైన నాటకాలు పుట్టినట్లు కనబడదు. ఈ కొరత ఆధునికయుగంలోనే తీరింది. ఈ విషయంలో చక్కని కృషిచేసి అంధ్రనాటక కళాపరిషత్తును స్థాపించి నాటక కళాభివృద్ధికి సర్వవిధాల తోడ్పడినవారు నేటి ఆంధ్రవిశ్వకళాపరిష దుపాధ్యక్షులు శ్రీ రాజా మేకా రంగయ్యప్పారావుగారు. వీరి జనకులు శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావుగారు గోవర్ధనోద్ధరణము మొదలయిన నాటకాలు కూడా రచించారు. ధర్మవరము రామకృష్ణమాచార్యులు, తిరుపతి వేంకటకవులు మొదలయినవారు అనేక నాటకాలు వ్రాసి ఆంధ్ర నాటకకళను అభివృద్ధిలోనికి తీసికొనివచ్చారు. చిత్రలేఖనంలో కూడ ఈ కాలంలో మంచి అభివృద్ధి కనబడుతుంది. శ్రీ దామెర్ల రామారావుగారు, శ్రీ అడవి బాపిరాజుగారు మొదలయిన వారు, కూల్ డ్రే దొరగారి శిష్యరికంచేసి భావచిత్ర, రూపచిత్రాత్మకమైన చిత్రకళను అభివృద్ధిలోనికి తెచ్చేరు. హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు అనేకములైన హరికథలను వ్రాసి ఆంధ్ర వాఙ్మయమునకు ఒక నూత్నాలంకారాన్ని సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ:

1956 నవంబరు 1వ తేదీనాడు ఆంధ్ర తెలంగాణములు రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రం రూపొందింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ మొదలయినవి స్థాపింపబడ్డాయి.