పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

వంశములవారు వైష్ణవులు. రెడ్డి రాజులు శైవులు. ఏది ఎలావున్నా పూర్వం మన దేశాన్ని ఏలిన రాజులందరూ మతసహనం కలవారే. మత ప్రవక్తలలో మాత్రం అసహనం ఉండేది కాదు. కాకతీయులు జౌనుల్ని హింసించారన్నది శుద్ధాబద్ధం; వారు శైవులైనా అన్ని మతాలవారిని సమాన బుద్ధితోనే చూచేవారు. జనుల్లో మతద్వేషాలుండేవి. బౌద్ధ, జైన మతాలు మన దేశంలో క్షీణించడానికి వీర శైవ విజృంభణ ముఖ్యకారణం.

వాస్తు శిల్పములు, చిత్రలేఖనము:

మన దేశంలో శిల్ప చిత్రలేఖనాది కళలన్నీ మొదట మతపరంగానే ఆవిర్భవించాయనీ, వాటి అభివృద్ధికి కూడా చాలవరకు మతమే కారణమనీ ముందే చెప్పబడింది. బౌద్ధమత వ్యాప్తికీ, శిల్ప చిత్రలేఖనాల వ్యాప్తికీ చాల దగ్గర సంబంధం ఉంది. హైందవ కళాసంపద కూడా దేవాలయ నిర్మాణంలోనే కనబడుతుంది. శాతవాహనుల కాలంలో వాస్తుశిల్పం స్తూపచైత్య విహార నిర్మాణంలో పరాకాష్ట నందుకుంది. అమరావతి, భట్టిప్రోలు స్తూపాలు ఇందుకు ప్రబలనిదర్శనం. అజంతా గుహల్లో ఆంధ్ర చిత్రకారుల కళానైపుణ్యం గోచరిస్తుంది. చాళుక్యులు, కాకతీయులు, విజయనగరాధిపతులు అనేక దేవాలయాల్ని నిర్మించారు. దాక్షారామంలోని చాళుక్య శిల్పం, రామన్న గుడిలోని కాకతీయ శిల్పం, హంపీలో ఇప్పటికీ గోచరిస్తున్న విజయనగర శిల్పం ఆ రాజన్యుల కళాపోషణాతత్పరతకీ ఆ శిల్ప శేఖరుల కళానిర్మాణ దక్షితకు ప్రత్యక్ష సాక్ష్యులు.

సంగీత నాట్యాలు:

దేవాలయ కుడ్య శిల్పాలలో గోచరించే నాట్యభంగిమల్నిబట్టి చాళుక్యుల కాలంలో నాట్యం అభివృద్ధిచెంది ఉంటుందని ఊహించవచ్చు. సంగీత కళాభివృద్ధి ఎలా ఉండేదో చెప్పడానికి ఆధారాలు అంతగా కనపడవు. కాకతీయుల కాలంలో సర్వతోముఖంగా అభివృద్ధి చెందాయనడానికి నిదర్శనా లనేకం ఉన్నాయి. అలాగే రెడ్డి వెలమల రాజ్యకాలంలో కూడా ఇవి అభివృద్ధి చెందాయి. జాయప సేనానినృత్త రత్నావళి, కుమారగిరి రచించిన వసంత రాజీయం మొదలయిన గ్రంథాలు ఆనాటి నాట్య కళాభివృద్ధిని వివరిస్తున్నాయి. రాచకొండ సర్వజ్ఞ సింగమనాయని సంగీత రత్నాకర వ్యాఖ్య, సంగీత సుధాకరము ఆనాటి ఆంధ్ర రచనలలో ముఖ్యమైనవి. వియయనగర సామ్రాజ్యంలో ఈ కళలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాయి. ఆనాటి ప్రబంధ కవులలో రామరాజ భూషణుడు సంగీత కళానిధి. అసలు శ్రీకృష్ణ దేవరాయలే సంగీతంలో సిద్ధహస్తులట. తంజావూరు నాయక రాజులు సంగీత నాట్యాలయెడ చూపిన మక్కువ అపారం. రఘునాథ నాయకుడు 'రఘునాథ మేళా' అనే వీణను కనిపెట్టాడట. నాట్య సంగీతాలలో పడి విజయ