పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

గోళకీ మఠాలు ప్రసిద్ధంగా ఉండేవి. శైవంతోపాటు వైష్ణవంకూడా బలంగానే ఉండేది. జైనుల ప్రాబల్యం తగ్గలేదు. బౌద్ధం ఇంచుమించుగా నశించింది. కాకతీయులు మూడువందల సంవత్సరాలకు పైన, ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. గణపతిదేవుడి కాలానికి ఇది ఒక మహా సాంరాజ్యంగా పరిణతి చెందింది. వీరికి ప్రచండమైన సైన్యం ఉండేది. వీరు నవలక్ష ధనుర్ధరాధి నాథులని ప్రశంసింపబడ్డారు. రెడ్డి, వెలమ, కమ్మ కులములవారు మహాసేనానులై, ఈ రాజ్యాన్ని పరిరక్షిస్తూ ఉండేవారు. వీరు కళాపోషకులు. వీరి ఇంకొక కులదైవం స్వయంభూదేవుడు. వీరు స్వయంభూదేవునికై కట్టించిన దేవాలయం ఆనాడు మహా ప్రసిద్ధంగా, శిల్పకళా శోభితంగా ఉన్నట్లు, క్రీడాభి రామకర్త వర్ణించాడు. ఆంధ్ర చరిత్రలో, కాకతీయుల రాజ్యకాలం మరువరాని మహోజ్జ్వల మట్టం.

రెడ్డిరాజులు (క్రీ.శ. 1324-1424-1430): వెలమరాజులు (క్రీ.శ. 1330-1430):

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, తత్సేనానాయకులైన రెడ్లు, వెలమలు, వేరు వేరు రాజ్యాలను స్థాపించారు. అద్దంకి రాజధానిగా ప్రోలయవేము డొక రాజ్యాన్ని స్థాపించగా, రాచకొండ, దేవరకొండ పట్టణములు రాజధానులుగా, పద్మనాయక వంశీయులైన వెలమ వీరులు రెండు రాజ్యాలను స్థాపించారు. రాచకొండ రాజ్యమును స్థాపించిన మహావీరుడు సింగమ నాయకుడు. ఈతని కుమారుడు అన పోతానాయకుడు బల పరాక్రమాల్లో అద్వితీయుడు. మునుసూరి కాపయనాయకుణ్ణి జయించి ఈ మహావీరుడు తెలంగాణాకుకూడా అధిపతి అయేడు. అనపోతా నాయకుడు తన సోదరుడైన మాధవ నాయకుణ్ణి దేవరకొండ రాజ్యానికి పాలకుడుగా నియమించాడు. ఈ రెండు రాజ్యాలవారు, వ్యక్తిగతంగా స్వతంత్రులైనా, ఇతర రాజ్యాలతో వివాదాలు వచ్చినప్పుడు, ఒకేమాట మీద నడిచేవారు. ఆనపోతే నాయకుడి తరువాత, అతని పుత్రుడు రెండవ సింగమ నాయకుడు రాజయేడు. ఈయన చాలా ప్రసిద్ధుడు. మహా విద్వాంసుడు. సర్వజ్ఞ బిరుదాంచితుడు. కవిపండిత పోషకుడు. రసార్ణ వసుధాకర గ్రంథకర్త. దేవరకొండ నేలినవారిలో లింగమ నాయకుడు మహాప్రసిద్ధుడు. వెలమ ప్రభువులు మొదట శైవులే, కాని వేదాంత దేశికుడి ప్రభావంవల్ల వైష్ణవం స్వీకరించారు. ఆనపోతా రెడ్డికాలంలో రెడ్లు, తమ రాజధానిని కొండవీటికి మార్చుకున్నారు. రాజమహేంద్రవరం రాజధానిగా, మరొకరెడ్డి వంశం వారు పూర్వాంధ్ర దేశాన్ని పరిపాలించారు.

విజయనగరసామ్రాజ్యం (క్రీ.శ.1336-1565):

విద్యారణ్యుని తపఃఫలంగా ఆవిర్భవించినది విజయనగర రాజ్యం. హరిహరుడు, బుక్కరాయలు అనే సోరరు లిర్వురు ఈ సాంరాజ్యాన్ని స్థాపించారు.